ఇసి స్పందించకుంటే న్యాయ పోరాటం : వైసిపి

May 23,2024 22:10 #vinathi, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్‌ స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని వైసిపి ప్రకటించింది. గురువారం సచివాలయంలో సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనాను వైసిపి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసిపి గ్రీవెన్స్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి కలిసి వినతిపత్రం సమర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున పోలింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. అనంతరం మల్లాది విష్ణు, కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి చేస్తున్న విధ్వంసాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని అన్నారు. 60, 70 పోలింగ్‌ బూత్‌లలోకి టిడిపి నాయకులు చొరబడి రిగ్గింగ్‌ చేశారని ఆరోపించారు. వెబ్‌ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలించి రీ పోలింగ్‌ జరపాలని కోరినా ఇసి స్పందిచకపోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో జరిగిన ఈ హింసకు ఇసి, బిజెపి, టిడిపి బాధ్యత వహించాలన్నారు.

➡️