నేడు, రేపు విఆర్‌ఎల రిలే దీక్షలు : విఆర్‌ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు

 మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-గుంటూరు

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం 18, 19 తేదీలలో విజయవాడలో జరిగే రిలే దీక్షలను జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఆర్‌ఎలకు పేస్కేల్‌ ఇవ్వాలని, 2018 నుండి రికవరీ చేసిన డిఎ బకాయిలను తిరిగి చెల్లించాలని, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగే దీక్షల్లో విఆర్‌ఎలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం ఈనెల 20వ తేదీలోగా స్పందించని పక్షంలో ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్రామాలలో వారధులుగా పనిచేస్తూ, శిస్తు వసూలు ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న విఆర్‌ఎలు గత ఆరేళ్లుగా జీతాలు పెరగక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ఇది చాలదన్నట్లు వీఆర్‌ఎలకు దశాబ్దాల నుండి అమలులో ఉన్న డిఏను నిలిపివేయటమే కాక గతంలో చెల్లించిన డిఎను రికవరీ చేసి, విఆర్‌ఎల సమస్యను మరింత పెంచిందన్నారు. తెలంగాణ మాదిరిగా ఎపిలోనూ పేస్కేల్‌ అమలు చేయాలని కోరారు. గత ఎన్నికలకు ముందు విజయవాడలో జరిగిన ధర్నా శిబిరానికి జగన్మోహన్‌రెడ్డి హాజరై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విఆర్‌ఎల జీతం రూ.15000లకు పెంచుతామని ప్రకటించినా అమలు చేయలేదన్నారు. ఆరు నెలల క్రితం రూ.500 పెంచుతామని ఫిబ్రవరి 2న జిఒ ఇచ్చిందని, అదే సందర్భంలో 2018 నుండి విఆర్‌ఎల జీతం నుండి ప్రతి నెలా రూ.300లు డిఎ రికవరీ చేసిందన్నారు. రికవరీ నిధులు తిరిగి విఆర్‌ఎలకు ఇస్తామన్న వాగ్థానం అమలు చేయలేదన్నారు. రాష్ట్ర అధ్యక్షులు టి అంజి మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, నామీనలను విఆర్‌ఎలుగా గుర్తించాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ బందగీసాహెబ్‌, రాష్ట్ర కోశాధికారి వడ్డే బాజీబాబు, జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

➡️