పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి.చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారంనాడు మిచౌంగ్‌ తుపాన్‌ వల్ల నేలమట్టమైన అరటి, ఆకుతోటలను వారు. పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తుపాను వల్ల పెనుప్రమాదం పొంచి ఉంని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు సహాయక చర్యలకు సిద్ధం కావాలని ముందస్తు మీటింగులు పెడుతున్నారు తప్ప, ఆచరణలో సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రెండు రోజులు ఎడతెరిపిలేని వర్షాల వల్ల రోజువారి కూలీ చేసుకునే పేదలకు పూట గడవడమే కష్టంగా ఉందని తెలిపారు. అలాంటి వారికి భోజనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఆరా కొరగా సాగు చేసిన చేతికొచ్చిన వరి, అరటి, తమలపాకు, బొప్పాయి పంటలు పూర్తిగా చేలోనే నేలకొరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అక్కడక్కడ సాగుచేసిన మినుము, సెనగ, ఉద్యాన పంటలు నేలబట్టమయ్యాయన్నారు. పత్తి పంట, పూల తోటలు పాడైపోయాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎక్కడ అందుబాటులో లేవని పేర్కొన్నారు. వరి కోత మిషన్లు యంత్రాలన్నీ వైసిపి నేతల ఇళ్లలో ఉన్నాయని విమర్శించారు. యంత్రాలు అందుబాటులో ఉంటే సగానికి పైగా పంట నూర్పిడి సకాలంలో చేసుకునే వారన్నారు. కనీసం ధాన్యం కప్పుకోవడానికి పట్టలు సరఫరా కూడా ప్రభుత్వం నిలిపేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణం ప్రభుత్వం దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తక్షణం తుపాన్‌ సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, మండల రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, రైతు నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, బాధిత రైతులు పాల్గొన్నారు. చాపాడు : మైదుకూరు మండలంలో మిచౌంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే ఆందోళన తప్పదని సిపిఎం నాయకులు గండి సునీల్‌ కుమార్‌, గుర్రయ్య హెచ్చరించారు. మండలంలోని లింగాలదిన్నెలో నేలమట్టమైన వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో రవి, శేఖర్‌, సుధాకర్‌, పోలయ్య, బాబు, గురయ్య పాల్గొన్నారు.

➡️