పకడ్బందీగా రెండో విడత ఆరోగ్య సురక్ష : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ గిరీష అధికారులకు సూచించారు. గురువారం రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష, ఐసిడిఎస్‌, రీ సర్వే మూడవ దశ, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో విసి ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని మినీ విసి హాల్‌ నుంచి కలెక్టర్‌ గిరీష, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీలేఖ, పాల్గొన్నారు. విసి అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 2 నుంచి జరుగుతున్న రెండో విడత జగనన్న ఆరోగ్యసురక్ష క్యాంపుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి ఆ వివరాలు స్థానిక వైద్య సిబ్బందికి అందజేయాలన్నారు.ప్రజలు వైద్య శిబిరాలకు హాజర య్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు పేషెంట్లకు సహకరిం చాలన్నారు. రోగులకు ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నెట్వర్క్‌, ఏరియా ఆసుపత్రులకు రెఫర్‌ చేయాలన్నారు. సంబంధిత వైద్య పరీక్షలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తే ఆ పేషెంట్‌ ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రెఫర్‌ చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహించే రెండో విడత జగనన్న సురక్ష క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొనేలా విస్తత ప్రచారం కల్పించాలన్నారు. వైద్య శిబిరాల్లో ఇద్దరు స్పెషలిస్ట్‌ డాక్టర్లతో పాటు 162 రకాల మందులు, 18 రకాల శస్త్రచికిత్సల కిట్లు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో వుంచుకోవాలన్నారు.ప్రతి ఒక్కరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి వైద్య సిబ్బంది ఇంటింటి క్యాంపెయిన్‌ వెళ్ళినప్పుడు ప్రజలు ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా వంద శాతం వెరిఫై చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకునే విధంగా ఏఎన్‌ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రోగ్రాం ఆఫీసర్లు, మండల ప్రత్యేక అధికారులు ఆస్పత్రులకు వస్తున్న పేషంట్ల రెఫరెల్స్‌ ను పరిశీలించాలన్నారు.ఆరోగ్య సురక్ష క్యాంపులలో కంటికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దష్టి పెట్టి కంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. కంటి జబ్బులను ఎక్కువగా జిజిహెచ్‌కు రెఫర్‌ చేయకుండా సంబంధిత ఏరియా ఆసుపత్రిలో క్యాటరాక్‌ ఆపరేషన్‌ లు నిర్వహించేలా చూడాలన్నారు. డ్రగ్స్‌ కౌంటర్లో ఫార్మాసిస్టు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలన్నారు.క్యాంపులు నిర్వహించిన అనంతరం ప్రతిరోజు ఫీడ్బ్యాక్‌ అందించాలని, క్యాంపులో ఏమైనా సమస్యలు వచ్చాయా, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ప్రోగ్రాం ఆఫీసర్లు తెలియజేయాలన్నారు.ఓపి డేటా పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు వంద శాతం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ఆపరేటర్లు ప్రతిరోజు ఓపి ఎంత వచ్చింది, ఎంత ఆన్లైన్లో ఎంట్రీ చేశారు జాగ్రత్తగా చూడాలన్నారు. జిల్లాలోని రేషన్‌ షాపులకు వచ్చిన పౌస్టి కాహారం కిట్లను వెంటనే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి చేరేటట్లు చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్‌ అధికారులకు సూచించారు. అంగన్వాడి కేంద్రాలలో సిబ్బంది సమయపాలన పాటించి సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు.రీ సర్వే పూర్తయిన గ్రామాలలో స్టోన్‌ ప్లాంటేషన్‌ 100 శాతం పూర్తి కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కొండయ్య, డాక్టర్లు, వ్యవసాయశాఖ జెడి చంద్రణాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️