పొంచి ఉన్న తుపాను ముప్పు

తుపాను ముప్పు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధితుపాను ముప్పు హెచ్చరికలతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో పంటలను కోల్పోయిన రైతాంగానికి పుండు మీద కారంలా తుపాను మారనున్న నేపథ్యంలో మిగిలి ఉన్న వారి ఆశలు మరింత ఆవిరి కానున్నాయి. తుపాను ప్రభావంతో శనివారం వాతావరణంలో మార్పులు కనిపించాయి. కొన్ని చోట్ల చిరు జల్లులు మొదలయ్యాయి. గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పలు చోట్ల వరి పనుల మీద ఉన్న నేపథ్యంలో పంటలను ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు నిమగమయ్యారు. తుపాను హెచ్చరికలతో సహాయక చర్యలు కోసం జిల్లా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. పాఠశాలలకు సెలవులు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.తుపాను కారణంగా ఈ నెల 3 నుంచి 5 వరకూ జిల్లావ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విశాఖ భారత వాతావరణ శాఖ ద్వారా నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడగా పశ్చిమ, వాయువ్య దిశలో 69 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ ప్రభావంతో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులు, భారీ వర్షాల వల్ల జన జీవనం తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని, తాటాకు, కచ్చా ఇళ్ళల్లో నివశిస్తున్న వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని యంత్రాంగం సూచిస్తుంది.కంట్రోల్‌ రూముల ఏర్పాటు తుపాను ప్రభావం దష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలక్టర్‌ కార్యాలయంలో 18004253077, కాకినాడ ఆర్‌డిఒ కార్యాలయంలో 800883208, పెద్దాపురం ఆర్‌డిఒ కార్యాలయంలో 9603663227 నెంబర్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా శాఖ, విద్యుత్‌, పంచాయత్‌ రాజ్‌, రోడ్లు, భవరనాల శాఖ, పోలీస్‌ తదితర ముఖ్య శాఖలకు సెలవులు రద్దు చేశారు. అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ముందు జాగర్త చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశాలిచ్చారు.తీర ప్రాంతాల్లో అలర్ట్‌జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలు భయం బయంగా గడుపుతున్నారు. తుపాను ప్రభావం ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. అలల ఉధృతి ఎక్కువగా ఉండవచ్చని తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావం వల్ల కెరటాల ఉధతి తీవ్రంగా ఉంటుందని, మత్స్యకారులు పడవలు, వలలు, తాళ్లు తీరానికి దూరంగా తరలించాలన్నారు. గాలులు వీస్తున్న సమయంలో ప్రజలు వెలుపలకు రావద్దని, ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, పశువులను బయట వదలకూడదని మత్య్సశాఖ అధికారులు సూచించారు.యంత్రాంగం అప్రమత్తం ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా చెట్లు, కరెంటు స్తంబాలు పడిన వెంటనే వాటిని తొలగించి రవాణా, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చేయడానికి రహదారులు భవనాలు, విద్యుత్‌, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో అవసరమయ్యే జెసిబిలు, పవర్‌ కట్టర్లు, పవర్‌ సాస్‌, ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచారు. విద్యుత్‌ తీగలు తెగి కింద పడినా, ఎక్కడైనా ప్రమాదకరంగా కనపడినా విద్యుత్‌ శాఖకు సమాచారం ఇస్తే వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులు, ప్రజలు తగు స్వీయ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిరక్షించడానికి వ్యవసాయ శాఖ ఇప్పటికే రైతులందరికీ తగు సూచనలు జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులు నింపుకొని,విద్యుత్‌ సరఫరా లేని సమయంలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని ఉన్నతాధికారులు అదేశాలిచ్చారు. అన్నదాతల్లో ఆందోళనతుపాను ముంచుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. చివరిలో చేతికందే సమయంలో వర్షాలు పడితే నష్టం తప్పదనే ఆందోళనలో రైతులు ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గండం నుంచి గట్టెక్కాలని కోరుకుంటున్నారు.

➡️