ప్రజా పోరాటంతో రోడ్డు పునర్నిర్మాణం

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం

ప్రజాశక్తి -అనకాపల్లి

ప్రజా పోరాటం ద్వారానే అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డును పునర్నిర్మాణం ప్రారంభమైందని, ఇది ప్రజా పోరాట పోరాట విజయమని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు, ఆర్‌.రాము, గంటా శ్రీరామ్‌తో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అత్యంత అధ్వానంగా తయారైన రోడ్డును విస్తరణ పేరుతో ఏళ్ల తరబడి నిర్మించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఇటీవల కాలంలో సిపిఎం, అఖిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా పోరాటంతో ఫిబ్రవరి 29వ తేదీన స్థానిక శాసనసభ్యులు పనులు ప్రారంభించారని, దీనిని సిపిఎం హర్షిస్తుందని పేర్కొన్నారు. రూ.6.5 కోట్లు విఎంఆర్‌డిఏ నిధులతో జరుగుతున్న ఈ పనులను స్వాగతిస్తున్నామన్నారు. అయితే భారీ వాహనాలు రాకుండా కట్టడి చేయడంతో పాటు ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈజెడ్‌, ఫార్మా తదితర కంపెనీలకు వెళ్లే భారీ వాహనాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, భవిష్యత్తులో రోడ్డు విస్తరణ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు. ఈ పోరాటంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

➡️