ప్రతి వారం పాఠశాలలను సందర్శించాలి

ప్రజాశక్తి – పార్వతీపురం : మై స్కూల్‌ – మై ప్రైడ్‌ కార్యక్రమంలో భాగంగా దత్తత అధికారులు ప్రతి వారం పాఠశాలలను సందర్శించాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల దత్తత అధికారులు పాఠశాలను విధిగా సందర్శించాలన్నారు. విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించాలని, ఆయా అంశాల్లో విద్యార్థులు బలోపేతం కావాలని సూచించారు. నోట్‌, వర్క్‌ పుస్తకాలను ఉపాధ్యాయులు తనిఖీ చేసినదీ, లేనిదీ విధిగా పరిశీలించాలని ఆదేశించారు. ఈనెల 24న విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షను నిర్వహించి వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యత పరిశీలించాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రక్తహీనత నివారణకు ఐసిడిఎస్‌ సిబ్బంది చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దత్తత అధికారులు వారంలో రెండుసార్లు విధిగా సందర్శించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కిట్లు వస్తున్నాయని వాటిని తీసుకోవాలని ఆదేశించారు. జలజీవన్‌ మిషన్‌ పనులు, గృహ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. పిఎం జన్‌మాన్‌ (ప్రధాన మంత్రి జన్‌ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌) కింద పివిటిజిలకు శత శాతం గృహాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 9825 కుటుంబాలకు అవసరమున్నట్లు ప్రాథమిక అంచనా అన్నారు. ఈనెల 31 నాటికి సర్వేను ఇంజినీరింగ్‌ సహాయకులు పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా చేయాలన్నారు. ప్రాధాన్యత పనులు త్వరగా అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా అందిన ఫారం 6,7,8 దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఓటరు నమోదు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు రశీదులు జాప్యం ఉండరాదుమిల్లుల వద్ద రశీదులు జాప్యం (అకనాలెడ్జిమెంట్లు పెండింగ్‌) ఉండరాదని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 59 మిల్లుల వద్ద 6440 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి రశీదులు జాప్యం ఉన్నట్లు సమాచారం ఉందని, తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఏ మిల్లు వద్ద మూడు గంటలకు మించి జాప్యం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. జాప్యం వల్ల ట్రక్‌ షీట్‌ జారీ సైతం జాప్యం జరుగుతుందని గమనించాలని ఆయన చెప్పారు. 26 నుంచి ఆడుదాం ఆంధ్రాఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఈ నెల 26 నుండి ప్రారంభమవుతున్నాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. క్రీడాకారులకు తెలియజేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చేయాలని, పోటీలను విజయవంతం చేయాలని కోరారు. క్రీడా పరికరాలు పంపిణీ జరుగుతున్నాయని, 193 మైదానాలు గుర్తించగా, ఇప్పటి వరకు 125 సిద్ధం చేశామని, మిగిలినవి వెంటనే సిద్దం చేయాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను బాడ్మింటన్‌, క్రికెట్‌, ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాంశాల్లో 15ఏళ్లుపైబడిన మహిళా, పురుషల విభాగాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకట రావు, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి జి.కేశవ నాయుడు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️