ప్రభుత్వానికి, ప్రజలకు వారధి వాలంటీర్లు

Feb 20,2024 21:50

ప్రజాశక్తి – పాచిపెంట: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉంటూ లబ్ధిదారులకు సకాలంలో సంక్షేమ పథకాలను అందజేస్తున్న వాలంటీర్లు సేవలు ప్రశంసనీయమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్‌ ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా రత్న, 270 మంది వాలంటీర్లకు సేవా మిత్రగా గుర్తించి వారికి సర్టిఫికెట్లు జ్ఞాపికలు అందజేసి, శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమల్లో క్షేత్రస్థాయిలో నిస్వార్థముగా సేవలందిస్తూ వాలంటీర్లు ప్రజా మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, వైస్‌ ఎంపిపిలు ఎం.నారాయణ, రవీంద్ర, మండల వైసిపి అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, నాయకులు టి.గౌరీశ్వరరావు, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.భామిని : ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు చెంతకు చేర్చిన మీ సేవలు మరువ లేనివని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి వాలంటీర్లను కొనియాడారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఎంపిడిఒ కిశోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. వాలంటీర్లకు అవార్డులు అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి తోట సింహాచలం, వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ కొత్తకోట చంద్రశేఖర్‌, జెడ్‌పిటిసి బొడ్డేపల్లి ప్రసాదరావు, సర్పంచులు, ఎంపిటిసిలు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️