బంద్‌ విజయవంతానికి విస్తృత ప్రచారం

Feb 14,2024 21:46

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌, మతతత్వ విధానాలను రైతులు, కార్మికులు ప్రతిఘటించి ఈ నెల 16న చేపట్టే గ్రామీణ భారత్‌ బంద్‌, కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు గేదెల సర్వేశ్వరరావు కోరారు. బుధవారం పార్వతీపురంలోని నాలుగురోడ్ల కూడలిలో గాంధీ విగ్రహం వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. అనంతరం జంక్షన్‌ నుండి పాతబస్టాండ్‌ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం కూరగాయల మార్కెట్‌ రైతులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌, మతతత్వ విధానాలను అవలంబిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలకు తీవ్ర ఆర్థిక భారాలు ఎదురవుతున్నాయని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తయినా దాని ఎజెండాలో పేర్కొన్న ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగుల్లోకి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అందులో భాగంగా చేపడుతున్న గ్రామీణ బంద్‌, కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు, ఐఎఫ్‌టియు నాయకులు బంకురు సూరిబాబు, పి.రాజశేఖర్‌, సిహెచ్‌.మౌళి, ఆర్‌.సర్వేశ్వరరావు, కృష్ణ, ఆర్‌.శివ, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.సాలూరురూరల్‌ : గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మండలంలో మామిడిపల్లి, కూర్మరాజుపేట, తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్‌.ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదన్నారు. ఉపాధి కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. ఉపాధి నిధులు తగ్గించేశారని తెలిపారు. కార్మికులకు అండగా ఉన్న చట్టాలను మార్చి, నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చారని, కార్మికుల హక్కులను హరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటన్నింటిపై చేపడుతున్న బంద్‌, కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, నాయకులు చిన్నారావు, ప్రజానాట్యమండలి నాయకులు రామారావు, తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : ఈ నెల 16న జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు కోరారు. మండలంలో పలు గ్రామాల్లో బంద్‌ విజయవంతానికి బుధవారం ఆటో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి నష్టం తీసుకొచ్చే చట్టాలను రద్దు చేయాలని గతంలో ఆందోళన చేసిన సందర్భంలో కేంద్రం హామీలు ఇచ్చినా అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.రామారావు, కృష్ణ, వెంకటరమణ పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గ్రామీణ బంద్‌ జయప్రదం చేయాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యాన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చెముడు గూడ ఎంపిటిసి మండంగి రమణ, కుక్కిడి సర్పంచి బిడ్డిక రాజారావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బిడ్డిక శంకర్రావు, సన్యాసిరావు, ఆడిత్‌ తదితరులు పాల్గొన్నారు.కురుపాం : 16న చేపట్టే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కార్మిక జెఎసి జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు కోరారు. బుధవారం మండలంలో నీలకంఠపురం పంచాయతీ మామిడిమానుగూడ జంక్షన్‌ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు బిడ్డికి వెంకటరావు, అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో ఆరిక ముకుందరావు, కొండగొర్రి నాగేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️