బడుగు వర్గాలకు ఎంఎల్‌ఎ ద్రోహం

Feb 2,2024 21:38
ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి

ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి
బడుగు వర్గాలకు ఎంఎల్‌ఎ ద్రోహం
ప్రజాశక్తి-కావలి : కావలి ఎం.ఎల్‌.ఎ. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అసైన్డ్‌మెంట్‌ చైర్మన్‌ అయ్యి ఉండి కూడా భూమి లేని పేదలకు ప్రభుత్వ భూమిని పంచేందుకు ప్రయత్నం చేయక పోవడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లేనని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి తప్పు పట్టారు. శుక్రవారం పట్టణంలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్‌డిఒ శీనానాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తం ఎన్నికల సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో భూ పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మిగులు భూమి, గ్రామనత్తం భూమి, సాగుబడి చేసుకొంటున్న భూమి ఒక్కొక్క మండలంలో 1500 ఎకరాలకుపైగా పంపిణీ జరుగుతూ ఉందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో భూ పంపిణీ జరుగుతుందని తెలిపారు. కావలి నియోజవర్గంలో భూ పంపిణీని ఎంఎల్‌ఎ చేపట్టలేదని తెలిపారు. కావలి శాసనసభ్యులు 3వేల ఎకరాలలో గ్రావెల్‌ ఎత్తుకొని, అమ్ముకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ వాళ్లని ప్రోత్సహించారని ఆరోపించారు. రుద్రకోట గ్రామంలో 515 సర్వే నెంబర్‌లో 1000 ఎకరాలు పైగా తవ్వుకోవడానికి ప్రోత్సహించారని తెలిపారు. పాతూరు, కావలి పట్టణానికి మొత్తం రియల్‌ఎస్టేట్‌ వారికి గ్రావెల్‌ అమ్ముకోవడానికి సహకరించారని ఆరోపించారు. తిప్ప దగ్గర 100 ఎకరాల వరకు గ్రావెల్‌ తవ్వుకునే వారిని ప్రోత్సహిస్తున్నారని, ఇప్పటికి గ్రావెల్‌ తవ్వుతున్నారని తెలిపారు. గిరిజన పాఠశాల స్థలాన్ని కూడా తవ్వుకున్నారని తెలిపారు. ఆములూరు దగ్గర 300 ఎకరాలు, 363 సర్వే నెంబర్‌లో కెకెగుంట దగ్గర 200ఎకరాలు, దామవరం విమానాశ్రయ భూముల్లో 50 ఎకరాలు, కడనూతల చెరువు పక్కన గ్రావెల్‌ తవ్వుకొన్నారని ఆరోపించారు. 6వేలమంది పేదల నోళ్లు కొట్టినారని ఆరోపించారు. కాబట్టి ఇప్పటికైనా సమయం 20రోజులు ఉన్నందున, కావలి డివిజన్‌లో భూపంపిణీ చేపట్టాలని పేదలపైన దయ ఉంటే శాసనసభ్యులు, అసైన్డ్‌మెంట్‌ చైర్మన్‌గా చర్యలు చేపట్టాలని కోరారు. తన అనుచరులకు గ్రావెల్‌ మాఫియాకు సహకరించకుండా ఇప్పటికైనా పేదలపై కనికరం చూపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యానాది సమాఖ్య అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు జరుగుమల్లి విజయరత్నం, నారుబోయిన లక్ష్మి నర్సు, చౌటూరి వెంకటరత్నం, పోట్లూరు విజయమ్మ, ఇంకా అనేకమంది పాల్గొన్నారు.

➡️