బాధితులకు న్యాయం చేస్తాం : ఆర్‌డిఒ

ప్రజాశక్తి-చెన్నూరు కడప -కర్నూలు జాతీయ రహదారి చెన్నూరు కొత్త రోడ్డు వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోయిన ఇంటి స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని, వారికి త్వరలోనే ఇంటి పట్టాలు అందజేస్తామని ఆర్‌డిఒ జి.ఆర్‌. మధుసూదన్‌ పేర్కొ న్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కనపర్తి గ్రామ పొలాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిపి చీర్ల సురేష్‌ యాదవ్‌, బాధితులకు సంబంధించిన సమస్యలను, జాతీయ రహదారిలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల గురించి ఆర్‌డిఒ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్పందించిన ఆర్‌డిఒ కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ రహదారి కొత్త రోడ్డు వద్ద గల సమస్యలను, రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోయిన బాధితులకు ఇంటి స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కనపర్తి లేఅవుట్లలో స్థలాలను పరిశీలించామని పేర్కొన్నారు. జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోయిన బాధితులు 256 మంది ఉండగా, స్థానికంగా 76 మంది లేరని మిగిలిన 180 మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని వివరించారు. ఇందుకు సంబంధించిన లేఅవుట్‌ కూడా తయారు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఓంనిటిపి రఘురాం రెడ్డి, తహశీల్దార్‌ పఠాన్‌ అలీ ఖాన్‌, సర్వేయర్‌ సోమశేఖర్‌, హౌసింగ్‌ ఎఇ మేనిల్‌, ఆర్‌ఐ, విఆర్‌ఒలు పాల్గొన్నారు.

➡️