బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ

Dec 15,2023 22:01

బాధితురాలితో మాట్లాడుతున్న ఇంటూరి
బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ
ప్రజాశక్తి-కందుకూరు:తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు చేపట్టిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కందుకూరు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. పట్టణంలో ప్రధానంగా ముస్లిం కాలనీల్లో పది రోజుల నుంచి ఆయన కలియ తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించే కార్యక్రమమే అయినప్పటికీ… దానికి సంబంధించిన కరపత్రాలు పంచడంతోపాటు ప్రజల సమస్యలు బాధలు తెలుసుకోవడానికి నాగేశ్వరరావు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఓపికగా వింటున్నారు. చిన్న చిన్న సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండడంతో ముస్లిం కుటుంబాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎదురవుతున్న సమస్యలను లోతుగా తెలుసుకుని, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో వెనువెంటనే వాటిని పరిష్కరిస్తామని నాగేశ్వరరావు భరోసాఇస్తూ ముందుకు సాగుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం అమలు చేసిన పథకాలను, వాటి వల్ల కలిగిన లబ్ధిని వివరిస్తున్నప్పుడు.. అవన్నీ నిజమేనంటూ ముస్లిం మహిళలు నాగేశ్వరరావుకు బదిలిస్తుండడం విశేషం. మరోవైపు జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో చాలా పథకాలను నిలిపివేశారని, ఆంక్షలతో సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని కూడా ఆ మహిళలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తీసుకొచ్చిన దుల్హన్‌ పథకం, పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపిందని సంతోషంతో చెబుతున్నారు. పండుగ సమయాల్లో అందించిన రంజాన్‌ తోఫా, మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలు, విదేశీ విద్య లాంటి పథకాలన్నీ తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, మళ్లీ చంద్రబాబు నాయుడు వస్తే ఆ పథకాలన్నీ తిరిగి అమలు చేస్తారన్న నమ్మకం ఉందని మహిళలు ఘంటాపదంగా చెప్పారు.రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే, కందుకూరు ప్రాంతాన్ని రోల్‌ మోడల్‌ గా చేసేందుకు శక్తి వంచన లేకుండా కషి చేస్తానని హామీ ఇచ్చారు.

➡️