బిజెపిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి

Mar 11,2024 23:27

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌
ప్రజాశక్తి – నరసరావుపేట :
ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న బిజెపి, దానికి వంతు పాడుతున్న రాష్ట్రంలోని టిడిపి, జనసేన, నిరంకుశ వైసిపిని ఓడించాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నరసరావుపేట నియోజకవర్గ విస్తృత సమావేశం సోమవారం పట్టణంలోని కోటప్పకొండ రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో జరిగింది. సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి సిలార్‌ మసూద్‌ అధ్యక్షత వహించగా విజరుకుమార్‌ మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే బిజెపి లాంటి మతతత్వ పార్టీ, తానికి వత్తాసుగా నిలుస్తున్న పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి బలపడితే రాజ్యాంగానే మార్చాలని చూస్తోందని, నిరంకుశ పాలన దీశగా దేశాన్ని బిజెపి తీసుకెళ్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే ప్రశ్నించే వారిపై కేసులు బనాయించడం, దేశద్రోహం పేరుతో నిర్బంధించడం చేస్తోందని, ప్రశ్నించేవారి గొంతులు నొక్కుతోందని విమర్శించారు. మీడియాపైనా ఆంఓలు విధిస్తోందన్నారు. ఈ చర్యలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. బిజెపి లాంటి నియంతత్వ మతతత్వ పార్టీ మరొక్కసారి అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో భారతదేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడించేలా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని అధికార వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ తన రాజకీయ అవసరాలకు వీలుగా బిజెపి వాడుకుంటోందని, చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆదే తరహాలో ఉపయోగిస్తోందని అన్నారు. ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సైతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాశనం చేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచవగ్గా అమ్ముతోందని మండిపడ్డారు. మరోవపు కీలకమైన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, రైతులు బతకలేని పరిస్థితులను కల్పిస్తోందని అన్నారు. బిజెపి విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగిందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ లేబర్‌ కోడ్‌లు తెచ్చిందని, సామాన్యులపై పన్నుల, ధరల భారం మోపిందని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోవడం లేదని అన్నారు. దేశానికి ప్రమాదంగా పరిణమించిన బిజెపిని రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని, అందుకు ప్రజలంతా ఏకమవ్వాలని కోరారు. సమావేశంలో నాయకులు డి.శివకుమారి, టి.పెద్దిరాజు, ఎం.ఆంజనేయులు, కె.నాగేశ్వరరావు, వెంకటేశ్వరరాజు, దుర్గారావు పాల్గొన్నారు.

➡️