బిజెపిని, దానికి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలి

Mar 4,2024 00:07

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌ :
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయీంచకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి మద్దతిస్తున్న వైసిపి, టిడిపి, జనసేనను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో డి.శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోని వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరిగిపోయాయని అన్నారు. మరోవైపు ప్రజలకు ఉపాధి సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న కీలక పరిశ్రమలను కార్పొరేట్‌ శక్తులకు కారుచవగ్గా కట్టబెడుతోందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపితో రాష్ట్ర ప్రభుత్వం పోరాడ్డం లేదని, కేంద్ర ప్రభుత్వ విధానాలకే వంతపాడుతోందని అన్నారు. ప్రతిపక్ష టిడిపి, దాని మిత్రపక్షం జనసేనకూడా ఇదే బాటలో ఉన్నాయని, ఈ మూడు పార్టీలూ బిజెపికి మద్దతుగా నిలవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు, రాజధానికి నిధులు కేటాయింపు కోసం బిజెపిపై రాష్ట్రంలోని అధికా, ప్రతిపక్షాలు పోరాడకుంటే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. మిచౌంగ్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు జె.రామారావు, కె.వెంకట శివరావు, కె.వెంకట సుబ్బారావు, పి.సలీం, ఎం.లక్ష్మి, షేక్‌ షమ్మి పాల్గొన్నారు.

➡️