భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు

విశాఖలో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు

ప్రజాశక్తి- విశాఖ లీగల్‌ : రాజ్యాంగ విరుద్ధమైన భూహక్కు చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం న్యాయవాదుల సంఘం డిమాండ్‌ చేసింది. రాష్ట్రం అమల్లోకి తెచ్చిన భూహక్కు చట్టాన్ని నిరసిస్తూ, బుధవారం నగరంలో సిఎంఆర్‌కు ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులతోపాటు, పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తులు కలిగి ఉన్న వారి హక్కులకు భంగం కలిగించేలా ఉన్న భూహక్కు చట్టం వల్ల రైతులకే కాకుండా న్యాయవాదులు, ఇతర అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, భూహక్కు చట్టాన్ని రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ నిపుణత లేని స్పెషలాఫీసర్‌ కోర్టుల వల్ల స్థిరాస్తులపై హక్కుల నిర్థారణ సాధ్యం కాదని, అదే విఫలమైతే మున్ముందు భూవివాదాలు మరింత ఎక్కవై శాంతిభద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమౌతాయని ఆవేదన వ్యక్తం చేశారు. బేషరతుగా భూహక్కు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని న్యాయవాదులంతా ముక్తకంఠంతో నినదించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు జెవివి రాఘవేందర్రావు, పలక శ్రీనివాసరావు, న్యాయవాదుల సంఘం ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు శ్రీదేవి, మోహన్‌నాయుడు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.గాజువాక : రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని డిమాండ్‌తో గాజువాక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు కెవి. స్వామి మాట్లాడుతూ, భూహక్కు చట్టాన్ని రద్దు చేసేవరకు న్యాయవాదులందరూ కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపడతామన్నారు. నిరసనలో బార్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి బివిఎం కృష్ణ, కోశాధికారి పల్లా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక సభ్యులు బిటివి.ప్రసాద్‌, సత్యనారాయణ, గిల్బర్ట్‌, శ్యామలరావు, సీనియర్‌ న్యాయవాదులు జి.చిరంజీవి, ఓ.రత్నరాజు, రామారావు, పోతన రాంబాబు, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

దీక్షాశిబిరంలో నినాదాలు చేస్తున్న న్యాయవాదులు

➡️