మరింత ముందుకు ‘మార్గదర్శిని’

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ బాల్యం నుంచే భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా విద్యార్థులలో అవగాహన కల్పించడానికి జిల్లాలో అమలు చేస్తున్న ‘మార్గదర్శిని’ కార్యక్రమాన్ని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ సహకారంతో మరింత ముందుకు తీసుకు వెళతామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ దిశగా తొలుత జిల్లాలో ఎంపిక చేసిన 20 పాఠశాలలు, ఆరు ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్‌ కాలేజీలలోని 82 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్స్‌కు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఒంగోలు రామచంద్ర మిషన్‌ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం ‘కెరియర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు’ పేరుతో మెల్‌బోర్న్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. అనంతరం స్కూల్‌ విద్యార్థులకు కూడా రాబోయే ఉద్యోగ అవకాశాలు, అందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై అవగాహన కల్పించేలా ఈ ఒప్పందాన్ని విస్తృత పరుచుకున్నట్లు తెలిపారు. స్కూల్‌ స్థాయిలోనే లక్ష్యసాధన కోసం అందుబాటులో ఉన్న అవకాశాలపై ‘మార్గదర్శిని’ పేరుతో జిల్లా యంత్రాంగం గత ఏడాది నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన దృష్ట్యా తొలుత ప్రకాశం జిల్లా నుంచే ‘కెరీర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు’ను కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్‌ వివరించారు. ఇందులో భాగంగానే ప్రస్తుత శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటికే అమలు చేస్తున్న ‘మార్గదర్శిని’ తీరును మెల్బోర్న్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన రాక్వెల్‌ షర్స్‌, బెంగళూరు నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ మంజునాథ్‌కు ఈ సందర్భంగా వివరించి, వారు సూచించిన అంశాలను కూడా మార్గదర్శినిలో చేరుస్తామన్నారు. రాక్వెల్‌ షర్బ్‌ మాట్లాడుతూ అంతర్జాతీయంగా లభిస్తున్న ఉద్యోగ అవకాశాలలో గణనీయంగా మార్పు వస్తుందన్నారు. వాటికి తగినట్లుగా విద్యార్థులకు ముందు నుంచే వివిధ లక్ష్యాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో తాము కలిసి పని చేస్తామన్నారు. ముందుగా ప్రకాశం జిల్లాకు రావటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ ఎంతో ముందుచూపుతో చేపట్టిన మార్గదర్శని కార్యక్రమంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో డిఈఒ విఎస్‌ సుబ్బారావు, మార్గదర్శిని జిల్లా నోడల్‌ అధికారి సామా సుబ్బారావు, ఆర్‌ఐఒ సైమస్‌ విక్టర్‌ డిఐఈఒ శ్రీనివాసరావు, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎంఈఒ రమేష్‌, సైన్స్‌ అధికారి రమేష్‌, డైట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️