మహిళల హక్కులను కాలరాసిన బిజెపి

ఐద్వా ఆధ్వర్యాన విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ గురజాడ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా హక్కులను కాలరాస్తోందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, జిల్లా అధ్యక్షులు బి.పద్మ, కార్యదర్శి వై.సత్యవతి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.మణి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన రోజు అని తెలిపారు. అధిక పని గంటలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాలను గుర్తుచేశారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఓటు హక్కు ఉండాలని డిమాండ్‌ చేస్తూ శ్రామిక మహిళలు చేసిన పోరాటాలు, సమ్మెలకు దోపిడీదారులు దిగిరాక తప్పలేదన్నారు. దేశంలో మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు బడ్జెట్‌లో మొండి చేయి చూపడం, మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయడానికి చిత్తశుద్ధి లేకపోవడం వంటి అంశాలు బిజెపి మనువాదం సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగమేనన్నారు. అందుకే భారతదేశంలో మహిళలకు మనువాదం కాదు – అందరివాదం కావాలి అని స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయ పార్టీలు మహిళా సమస్యలను చేర్చాలని, చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను 2024 ఎన్నికల నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్‌.వరలక్ష్మి, కె.మణి, కె.కుమారి, ఆర్‌.రంగమ్మ, గౌరి, బి.భారతి, డి.కొండమ్మ, ఎ.పుష్ప, బొట్టా ఈశ్వరమ్మ, వి.ప్రభావతి, వెంకట లక్ష్మి, జి.లక్ష్మి, సంతోషం, కె.వేణు, వరలక్ష్మి పాల్గొన్నారు. ఎపి మహిళా సమాఖ్య ఆధ్వర్యాన.. లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు మహిళలు నడుం బిగించాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మహిళా సమాఖ్య విశాఖ జిల్లా సమితి అధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు హరిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేగం, ఉపాధ్యక్షురాలు ఎ.దేవుడమ్మ, అన్నపూర్ణ, సహాయ కార్యదర్శులు, గాయత్రి అరుణ, కోశాధికారి జి.జయ పాల్గొన్నారు.

➡️