మహిళా కూలీలను చిదిమేసిన ప్రమాదం

Mar 26,2024 23:58

ప్రమాదానికి గురైన ఆటో
ప్రజాశక్తి, పెదనందిపాడు, పెదనందిపాడు రూరల్‌ :
రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా వ్యవసాయ కూలి మృతి చెందగా 9 మంది తీవ్ర గాయాలపాలైన ఘటన మండలంలోని పాలపర్రు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పెదనందిపాడు – చిలకలూరిపేట ప్రధాన రహదారి పాలపర్రు వద్ద ఉన్న ఎన్‌ఎన్‌బి కోల్డ్‌ స్టోరేజ్‌ సమీపాన వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటో.. శనగల లోడుతో కోల్డ్‌ స్టోరేజ్‌ వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ సైడ్‌కు తగలడంతో ఆటో బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌ సహా 16 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీరందరూ కాకుమాను మండలం అప్పాపురానినికి చెందిన బీసీ, ఎస్సీ, మైనారిటీ మహిళలు. మంగళవారం తెల్లవారుజామునే పాలపర్రులో శనగ పీకే పని కోసం ఆటోలో వచ్చి, పని అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో సుమారు 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మల్లెల వెంకాయమ్మ (57) తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పీకా శరణ్య కాలు తెగిపోయింది. తెగిపడిన కాలు దూరంగా రోడ్డు పక్కన పడి ఉండటం అందరినీ తీవ్రంగా కలిసి వేసింది. పీకా రాధా, కటికల షైనీ, మూకిరి వనజాక్షి, షేక్‌ అమీనా, మల్లెల కృష్ణవే ణికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షగతాత్రులను మూడు అంబులెన్స్‌ల ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అప్పాపురం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పని ముగించుకొని కాసేపట్లో ఇంటికి వస్తారు అనుకునే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల బంధుమిత్రులు తీవ్ర ఆవేదనను వెలిబుచ్చారు. అందరూ పేద, బలహీన వర్గాలకు చెందిన మహిళలు, పని చేసుకుంటే కానీ కుటుంబాలను పోషించుకోలేని వారే. ఘటనా స్థలిని పెదనందిపాడు ఎస్‌ఐ టి.రాజ్‌కుమార్‌ పరిశీలించి వాహనాలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.రూ.20 లక్షల పరిహారమివ్వాలిఇదిలా ఉండగా మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం, వైకల్యానికి గురైన వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.రెండేసి లక్షల చొప్పున ఇవ్వాలని సిపిఎం పెదనందిపాడు మండల కార్యదర్శి దొప్పలపూడి రమేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. ప్రమాదం స్థలిని సిపిఎం నాయకులు పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు. మృతి చెందిన వెంకాయమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️