మహిళ రక్షణ హక్కులకై ఐక్యంగా ఉద్యమిద్దాం : ఐద్వా

Mar 12,2024 17:18 #aidwa, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : మహిళా రక్షణ హక్కులకై ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలోని స్థానిక బుధవారపేటలో మెరీడియన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్‌.అలివేలు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా రక్షణ హక్కులకై ఐక్యంగా ఉద్యమిద్దాం అనే అంశంపై ఐద్వా, శ్రామిక మహిళా సంఘం, యుటిఎఫ్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ అనురాధ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, అంగన్వాడి టీచర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు జిల్లా కార్యదర్శి రేణుక, పుణ్యవతి టిఎల్‌ఎఫ్‌ అధ్యక్షులు కిరణ్మయి మాట్లాడుతూ మహిళలు హింసకు వ్యతిరేకంగా పోరాడి వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళలకు సమానత్వం కావాలి అంటే అది ఇంటి నుండే మార్పు మొదలు కావాలని పిల్లలను పెంచే విషయం దగ్గర నుండి ఆడపిల్లలను మగ పిల్లలను అన్ని విషయాల్లోనూ సమానంగా పెంచాలని పిలుపునిచ్చారు. అలాగే నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ వారి ప్రతిభను చాటుతున్నారు. వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు కానీ ఇంట్లో పెద్దలు గాని ముందుకు రావాలని తెలిపారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మహిళలు గుడి, బడి, ఆఫీస్‌, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ అన్నింటిలోనూ హింసకు, అత్యాచారాలకు బలవుతున్నారని తెలిపారు. ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని ఆరోపించారు. చివరికి డబల్‌ ఇంజన్‌ సర్కార్‌ పేరుతో రోజు గొప్పలు చెప్పే బిజెపి ఉత్తరప్రదేశ్‌ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్‌లో మహిళల పైన పసిపిల్లల పైన అత్యాచారాలు జరుగుతే బిజెపి మంత్రులే డ్రెస్సులు వేసుకోవడం వల్ల, ఆడవారు బయట తిరగడం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని నిందించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చివరికి మత ఉన్మాద మూకల చేతిలో కుటుంబాన్ని పోగొట్టుకొని అత్యాచారానికి గురై ప్రాణాలు రక్షించుకొని కోర్టులో శిక్ష వేయించిన బిల్కిస్‌ భాను నిందితులను సహితం సత్య హరిచంద్రులంటూ విడుదల చేసిన దుర్మార్గమైన ఘనత బిజెపికే చెందుతుందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార వైసిపి మహిళలకు ప్రాధాన్యత అంటూ మాటలు చెప్పడం తప్ప మహిళలపై దాడులు దౌర్జన్యాలలో అత్యాచారాలు జరుగుతే వెంటనే స్పందించి శిక్షించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేసే మహిళలకు అండగా నిలిచే అభ్యర్థులకు మహిళలందరూ ఓట్లు వేసి గెలిపించినప్పుడే మహిళలకు నిజమైన గౌరవం దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని షేక్‌ హసీనా, సావిత్రిబాయి పూలే వేషధారణలో సావిత్రిబాయి, ఫాతిమా షేక్‌ మహిళల అభివృద్ధి కోసం మహిళలకు విద్య అందించడానికి చేసిన కృషి అలాగే ఓటు గొప్పతనానికి సంబంధించిన పాటలు పాడి అందరిని ఎడ్యుకేట్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అరుణ ,ఓల్డ్‌ సిటీ అధ్యక్ష కార్యదర్శులు బంగి పద్మ, రషీద, ఐద్వా ట్రెజరర్‌ పి.ఎస్‌ సుజాత, ఐద్వా నాయకులు అనసూయ ,శేకున్‌, శ్యామల, కమరున్‌, డివైఎఫ్‌ఐ నాయకులు శిరీష, పి.ఎన్‌.ఎమ్‌. కళాకారిణి నోమేశ్వరి, వేణి, శ్రామిక మహిళలు, అంగన్వాడి ఆశ వర్కర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️