మాడగడలో కాంగ్రెస్‌ ప్రచారం

ఎపి కాంగ్రెస్‌ ఆదివాసీ విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్‌ పాచిపెంట శాంతకుమారి

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: మండలంలోని మాడగడలో ఎపి కాంగ్రెస్‌ ఆదివాసీ విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్‌ పాచిపెంట శాంతకుమారి పర్యటించి, ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి గిరిజనులను తీవ్రంగా మోసం చేశాయన్నారు. బిజెపితో జత కట్టిన వైసిపి, టిడిపి, జనసేనలతో భవిష్యత్‌లో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా గిరిజనులకు తీవ్రనష్టం పొంచి ఉందన్నారు. జిఒ 3రద్దుతో మన్యంలోని గిరిజనులకు శతశాతం ఉద్యోగావకాశాలను కోల్పోయారని, దీనిపై పాలక ప్రభుత్వాలు, గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఎస్‌సి,ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లింపు, భాషావాలంటీరు,్ల ఆశ్రమ పాఠశాలల హెల్త్‌ వాలంటీర్ల సమస్యల పరిష్కారంలో వైసిపి విఫలమైందన్నారు. అరకు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీచేస్తున్నానని, ఆదరించి, గెలిపించాలని అభ్యర్థించారు. గోడాగాడ్‌ వంతెన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ తెలగంజి సోమేశ్వరరావు, పిసిసి సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి, అరకువేలీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొర్ర పోతురాజు, మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్‌, మహిళా కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షురాలు గుంజిడి గేనమ్మ, సీనియర్‌ నాయకులు గుంజిడి సుబ్బారావు, కొర్ర రఘురాం, మహిళలు గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నేత శాంత కుమారికి ఘన స్వాగతం పలుకుతున్న గిరిజనులు.

➡️