మామిడి పూతకు తెగుళ్ల వాత

Mar 12,2024 23:48

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మామిడి చెట్లకు ఈ ఏడాది పూత బాగా వచ్చిందని రైతులు సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చెట్లకు పేను బంక తెగులు సోకడంతో పూత పిందె రాలిపోతున్నాయి. పల్నాడు జిల్లాలో 700 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మామిడి తోటలు సాగవుతున్నాయి. నరసరావుపేట, రాజుపాలెం, క్రోసూరు మండలాల్లో అత్యధికంగా సాగవుతోంది. గతేడాదితో పోలిస్తే పూత ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది దిగుబడిపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలను పేను బంక, బూడిద తెగుళ్లు నాశనం చేస్తున్నాయి. తెగుళ్ల కారణంగా పూతతో పాటు, మామిడి పిందెలు రాలిపోతున్నాయని, నష్టం రూ.లక్షల్లో ఉంటుందని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడులైనా వచ్చేలా లేవంటున్నారు. సాధారణంగా మంచు తీవ్రతకు వచ్చే బూడిద తెగులు వాతావరణంలో సంభవించిన మార్పుల నేపథ్యంలోనే ఈ ఏడాది మంచు తీవ్రత ఒక మోస్తరుగా ఉన్నా ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. 6.5 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటకు వ్యాపారులు రూ.4 లక్షలకు పైగా ధర చెల్లించి పంటను విక్రయించుకునేవారు. ప్రస్తుతం పూత పిందెలు రాలిపోతుండడంతో తోట కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో మామిడి పండ్ల ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. గతేడాది కిలో మామిడి పండ్లు నాణ్యతను బట్టి రూ.60-80 వరకు ఉండగా ఈసారి రూ.100 పైగా పెరగవచ్చని అంచనా. వినియోగదార్లకు ఇది చేదయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు నష్టాల బారిన పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నష్టాలు తప్పేలా లేవు
తోకల కోటేశ్వరరావు, కౌలురైతు, పెద్దరెడ్డిపాలెం, నరసరావుపేట మండలం
నాదెండ్ల మండలం కనపర్తిలో 1.60 ఎకరాల్లో మామిడి తోటను రూ.50 వేలకు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాను. మొదటి రెండేళ్లు పెట్టుబడులు పోను కొంత లాభం వచ్చింది. గతేడాది బొబ్బర తెగులు సోకడంతో పెట్టుబడుల వరకే రాబట్టుకోగలిగాం. ఈ ఏడాది పూత మొత్తం రాలి పోయింది. పేను బంక నివారణ కోసం రసాయనిక పురుగు మందులకు రూ.12 వేలు, పశువుల ఎరువుకు రూ.7 వేలు ఖర్చు చేసినా నష్టాలు తప్పేలా లేవు.
ఇలా చేయండి..
సిహెచ్‌. వెంకట రమణరెడ్డి, ఉద్యాన శాఖాధికారి, పల్నాడు జిల్లా.
రైతులు నేరుగా పురుగు మం దుల దుకాణాల వారిని సంప్ర దించకుండా ఉద్యాన శాఖాధికారుల సూచనలు మేరకు యాజమాన్య చర్యలు చేపట్టడం మంచిది. పురుగు, తెగుళ్ల మందులతో పాటు పూత దశలో తరచూ బోరాన్‌ పిచికారీ చేయడం ద్వారా తోట మెత్తగా ఉండడం, ఆడ పూతలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. పేనుబంక నివారణకు మోనోక్రోటోఫాస్‌ 2 మిల్లీ లీటర్లు, కార్బెండిజం ఒక గ్రాము, స్టిక్కింగ్‌ ఏజెంట్‌ 0.5 మిల్లీ లీట ర్లను ఒక లీటరు నీటికి కలిపి చెట్టు మొత్తం బాగా తడిసే లా పిచికారీ చేయాలి. 10 నుండి 15 రోజుల అనంతరం బుఫ్రొఫిజిన్‌ 1.5 మిల్లీ లీటరు, థయోఫినెట్‌ మిథైల్‌ 1 గ్రాము, ప్లానోఫిక్స్‌ 20 మిల్లీలీటరును లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. 3వ సారి బుఫ్రోఫెజిన్‌, ఎసిఫే ట్‌ 1 గ్రాము లేదా డైనెటోఫ్యూరాన్‌ 20 గ్రాములు, సాఫ్‌ 2 గ్రాములు, ప్లానోఫిక్స్‌ 0.2 విల్లీలీటర్లు లీటరు నీరు చొప్పున పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు హెక్సాకో నాజోల్‌ 2 మిల్లీ లీటర్లను లీటరు నీటితో పిచికారీ చేయాలి.

➡️