మిడ్డే కార్మికుల ధర్నా

 ప్రజాశక్తి-సీతమ్మధార : వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అక్కయ్యపాలెం జోన్‌ నాయకులు రాజు మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు వేతనం ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు, మెనూచార్జీ రూ.20కి పెంచాలని, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలని, గుర్తింపు కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేశారు. వంటచేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన వారికి నష్ట పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని, హైస్కూలులో పనిచేస్తున్న వారికి వేతనం, సెలవులు, మెటర్నిటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కల్పించాలని సంవత్సరానికి 2 జతల యూనిఫామ్‌ ఇవ్వాలని, 2 నెలలకు ఒకసారి వర్కర్లతో ఎంఇఒలు సమావేశాలు పెట్టాలని డిమాండ్‌చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగశ్రీ, జోన్‌ నాయకులు కలాచందన, వరలక్ష్మి, దేవి, నిర్మల, కనక, పార్వతి తదితరులు పాల్గొన్నారు.మిడ్డే కార్మికుల ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న రాజు

➡️