మిర్చిరైతు కంట నకిలీల కారం

ప్రజాశక్తి – మేడికొండూరు : ఎన్నో ఆశలతో మిర్చిని సాగు చేపట్టిన రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టిన వ్యాపారులు నిలువునా ముంచారు. అధికారులకు బాధిత రైతులు విన్నవించినా పట్టించుకోపోవడంతో కౌలురైతు సంఘానికి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని సిరిపురంలో బాధితుల పొలాలను కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, నాయకులు బి.రామకృష్ణ గురువారం పరిశీలించారు.గ్రామానికి చెందిన పలువురు రైతులు, కౌలు 50 ఎకరాల్లో యుఎస్‌ అగ్రి సీడ్స్‌ వారి ఎస్డబ్ల్యూ 450 రకం విత్తనాలను సాగు చేశారు. ఎకరాకు రూ.1.66 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. అయితే పూత రాలిపోవడం, చిగురు బలహీనంగా ఉండడం, చెట్టుకు నాలుగైదు కాయలకు మించి లేకపోవడం తదితర లక్షణాలను గుర్తించిన రైతులు తాము మోసపోయామనే నిర్థారణకు వచ్చారు. దీనిపై గతనెలలో స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా అధికారుల నుండి స్పందనేమీ లేకపోవడంతో కౌలురైతు సంఘం నాయకులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో పొలాలను పరిశీలించడంతోపాటు బాధిత రైతుల నుండి వివరాలను నాయకులు సేకరించారు. ఈ సందర్భంగా ఎం.హరిబాబు మాట్లాడుతూ నకిలీల వ్యవహారంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలన్నారు. రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలంటే నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం కింద రూ.1.50 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, ఇప్పటికైనా ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో బాధిత రైతులు పోపూరి సుబ్బారావు, కాపూరి వీరరాఘవయ్య, నందా రామచంద్రరావు, నందా సురేష్‌, పప్పుల శివయ్య, పెరవల్లి వీరయ్య చౌదరి, నల్లమోతు పూర్ణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నారు.

➡️