ముంచుకొస్తున్న మిచౌంగ్

ముంచుకొస్తున్న మిచౌంగ్

ప్రజాశక్తి-యంత్రాంగం మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి ఎడతెరపి లేని భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలపై కసరత్తు చేస్తున్నారు. రామచంద్రపురంలో ఉదయం నుంచి తుపాను ప్రభావంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. మార్కెట్లు మూతపడ్డాయి మెయిన్‌ రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెల పోయాయి. కె.గంగవరం మండలంలోని కోటిపల్లి రేవును తుపాను ప్రభావంతో మూసివేశారు. దీంతో పడవలు, పంట్లు ఒడ్డుకు చేరాయి. మత్స్యకారులు గోదావరిలోకి వేటకు వెళ్ళవద్దని తహశీల్దారు వైద్యనాథ్‌ శర్మ సూచించారు. పాఠశాలలో విద్యాసంస్థలు తుపాను ప్రభావంతో మూతపడ్డాయి. నిత్యవసర వస్తువులు తెచ్చుకునేందుకు సామాన్యులు ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది.మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ కె.గంగవరం మండలం కుందూరు, గంగవరం, రామచంద్రపురం మండలంలోని వెలంపాలెం, నెలపర్తిపాడులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఆధైర్య పడవద్దని మిల్లర్లకు ధాన్యం కొనుగోలుపై నిబంధనలను సడలించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ఇప్పటికే మిల్లర్లకు ధాన్యం కొనుగోలుపై పాలు సూచనలు చేశామని వివరించారు ఆయన వెంట రామచంద్రపురం ఆర్‌డిఒ సుధాసాగర్‌, తహశీల్దార్లు ఎం.వెంకటేశ్వరరావు, వైద్యనాథ్‌ శర్మ ఉన్నారు. భారీ వర్షాలతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ద్రాక్షారామం నుంచి యానాం వెళ్లే మెయిన్‌ రోడ్డు అన్నాయిపేట వద్ద నుంచి వేగాయమ్మపేట వరకూ, కుయ్యేరు నుంచి కాజులూరు వరకూ, కోలంక నుంచి యానాం వరకూ దారుణంగా మారింది. నదురుబాద, మాలపాడురోడ్డు, వెల్ల, ఆదివారపుపేట, ద్రాక్షారామ రోడ్డు, యర్రపోతవరం, శివల, దంగేరు రోడ్డు, రోడ్డు పూర్తిగా పాడే వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. రామచంద్రపురం పట్టణంలోని శివాలయంలో వీధిలో ఈదురు గాలులకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో 12 విద్యుత్‌ సర్వీసులు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది స్థానికులు తిరిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు.ఉప్పలగుప్తం తీర గ్రామాలైన ఎస్‌.యానాం, వాసాలతిప్ప తదితర గ్రామాల్లో తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి, ట్రైనీ డిఎస్‌పి విష్ణు స్వరూప్‌, సిఐ వీరబాబు, ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు రెవెన్యూ సిబ్బంది పర్యటించారు. సముద్రపు ఒడ్డున ఉన్న వలస మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మామిడికుదురు 216వ జాతీయ రహదారి పాశర్లపూడి, మామిడికుదురు, నగరంలో జలాశయంగా మారింది. భారీ వర్షాల తీవ్రత దష్ట్యా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు. మామిడికుదురు ఆల్‌ క్యాస్ట్‌ కాలనీ, మొగలికుదురు వీవర్స్‌ కాలనీ, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, పాశర్లపూడి సత్రంతోట జలాశయాలుగా మారాయి. సముద్రతీర గ్రామాలైన కరవాక, ముత్యాలపాలెం, గోగన్నమఠంలో సహాయ చర్యలు చేపట్టారు. లూటుకుర్రు పిహెచ్‌సి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తహశీల్దారు రియాజ్‌ హుస్సేన్‌, ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు సముద్రతీర గ్రామాల్లో సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షిస్తున్నారు.మండపేట గాలి కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం కారణంగా రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తాపేశ్వరం ద్వారపూడి రోడ్డు, మండపేట ఏడిద రోడ్లు చెరువును తలపిస్తున్నాయి.ముమ్మిడివరం భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోలీస్‌ స్టేషన్‌, తహశీల్దార్‌ కార్యాలయం, సబ్‌ ట్రెజరీ, వ్యవసాయ శాఖ కార్యాలయాల ఆవరణలు మోకాల్లోతు నీట మునిగాయి. బళ్లగేటు సెంటర్‌ నుంచి వెళ్లే ఆసుపత్రుల రహదారి, మార్కెట్‌ ప్రాంతంలోని మండబయలు, జిఎంసి బాలయోగి కాలనీలు వర్షపు నీటి ముంపులో చిక్కుకున్నాయి. కాట్రేనికోన మండలంలో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కోత కోసిన వరి పనలు నీటిలో మునిగిపోయి తేలియడుతున్నాయి. వర్షాలకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఎప్పటికప్పుడు సరఫరాను పునరుద్దరణ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచినట్టు తహశీల్దారు సత్యనారాయణ తెలిపారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో ప్రజలను అధికారులు అధికారులు అప్రమత్తం చేశారు. మగసానతిప్ప గ్రామ ప్రజలకు కాయగూరలను నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ప్రతి మత్స్యకార గ్రామంలో ఉన్న తుపాను సెంటర్లను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేసి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సహాయక చర్యలపై కలెక్టర్‌ సమీక్షఅమలాపురం : తుపాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లోకంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి సహాయక పునరావాస చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తహశీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని మంగళవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ముంపు బారిన పడే బాధితులు ఈ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం వరకు తుపాను ప్రభావం ఉంటుందని, అదే సమయంలో గంటకు వంద కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని చెప్పారు. ఈ నెల 4, 5న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్‌ కళాశాలకు కూడా సెలవు ప్రకటించామన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆయన ఆరా తీశారు. రైతుకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా అధికారులు తోడుగా నిలవాలని ఆదేశించారు. ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం సాయంతో చర్యలు చేపట్టామన్నారు. 24 గంటలూ నిరంతరాయంగా విధుల్లో ఉండాలన్నారు. తుపాను ప్రభావంతో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ లేదా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ను ఫోన్‌లో సంప్రదించి సహాయక చర్యలు పొందవచ్చని తెలిపారు.

➡️