మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవేన్స్‌,బకాయిలు తక్షణమే చెల్లించాలి

  • విఎంసి వద్ద ధర్నా
  • అస్టెంట్‌ కమిషనర్‌, హెల్త్‌ ఆఫీసర్‌కి వినతి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జీతాలు , ఆరోగ్య భృతి బకాయిలు చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికులకు 21000/-లు, డ్రైవర్లకు 24500/-లు బేసిక్‌ వేతనం అమలు చేయాలని , విలీన ప్రాంత కార్మికులకు వర్తింప చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో విజయనగరం నగర పాలక సంస్థ నందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌ను ప్రజారోగ్య అధికారిని కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్రావు , నాయకులు బొగ్గు భాస్కరరావు మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి మూడు నెలల అలవేన్సె రూ.18,000/-లు , పంప్‌ హౌస్‌ కార్మికులకు, లీకులు, వాల్‌ ఆపరేటర్లు, ప్లాంటేషన్‌, ఆఫీస్‌ సబార్డినేట్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌కు ఐదు నెలల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. 16 రోజులు విరోచిత పోరాట ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులను క్లీన్‌ ఎన్విరాన్మెంటల్‌ వర్కర్లుగా మార్పు చేసి 21000/-, డ్రైవర్లకు 24500/- బేసిక్‌ వేతనం అమలకు మార్చి 1 జీవో నెంబర్‌ 36 ఇచ్చిందని తెలిపారు. విజయనగరం నగర్‌ పాలక సంస్థ నందు విలీన పంచాయతీలో పనిచేస్తున్న 7 మంది కార్మికులకు ఈ జీవో వర్తింప చేస్తూ 21000/- జీతం అమలు చేయాలని అధికారులను కోరారు. జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించేంతవరకు దశలవారీగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ధర్నా కార్యక్రమంలో నాయకులు రజిని, రాఘవ, రమా,కుమారి, లక్ష్మణ, తిరుమల, వంశీ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️