మున్సిపల్‌ కార్మికుల బిక్షాటన

Jan 10,2024 21:09

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గంటస్తంభం వరకు భిక్షాటన చేసి ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ‘పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన జల్లుకున్నా పుణ్యమే, లక్ష రూపాయలు జీతం ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం. అందర్నీ పర్మినెంట్‌ చేస్తాం’ అనివాగ్దానం చేశారని వివరించారు. సమాన పనికి సమానం ఇస్తామని చెప్పారని, కానీ ఐదేళ్లువుతున్నా హామీలు అమలు చేయలేదన్నారు. 16 రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించడ లేదన్నారు. సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రజిని, పైడిరాజు, వెంకట్రావు, వంశీ, సూరి, ఈశ్వరమ్మ, రమణ బాబురావు, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజాం: మున్సిపల్‌ కార్మికులు మాధవ బజార్లో భిక్షాటన చేసి ప్రభుత్వ వైఖరి పై నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌, గురువులు, రాజేష్‌, గిరిబాబు, లక్ష్మి, భాస్కరరావు, వెంకటీ, శంకర్రావు, అచ్యుత్‌ రావు, రవి, గోపి, సింహాచలం పాల్గొన్నారు.

బొబ్బిలి : పారిశుధ్య కార్మికులు సమ్మె శిబిరంలో నిరసన తెలిపారు.

సమస్య పరిష్కరించకుండా పనులెలా చేయిస్తారు?

నెల్లిమర్ల : హామీలు అమలు చేయకుండా ప్రయివేటు వ్యక్తులతో పనులెలా చేయిస్తారని, ఇటువంటి కవ్వింపు చర్యలను అడ్డుకుంటామని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి.వి.రమణ, జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ యునియాన్‌ పట్టణ అధ్యక్షులు బొగ్గు భాస్కరరావు హెచ్చరించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద అధికార్లు, పాలక వర్గం సభ్యులు ప్రైవేట్‌ వ్యక్తులతో పారిశుధ్య పనులు చేయడానికి ప్రయత్నించారు. దీన్ని మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించకపోగా ఇతర వ్యక్తులతో పనులు జరిపించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.

➡️