‘యలమంచిలి అభివృద్ధికి వైసిపి కట్టుబడి ఉంది’

మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి రాజా

ప్రజాశక్తి – యలమంచిలి :

ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా యలమంచిలి ప్రాంత అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అన్నారు. జాతీయ రహదారి గుండా యలమంచిలి పట్టణంలోకి నిర్మించిన రైల్‌ ఓవర్‌ బ్రిడ్జిని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా మారిన వైసీపీ ప్రభుత్వానికి మరోమారు అవకాశం కల్పిస్తే అన్ని విధాల ప్రజల అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కన్నబాబురాజు మాట్లాడుతూ రూ.35 కోట్ల అంచనా వ్యయంతో 2009లో తన హయాంలో 70 శాతం పూర్తయిన బ్రిడ్జి పనులు తరువాత టిడిపి ప్రభుత్వంలో నిలిచిపోయాయని, తిరిగి తామే పూర్తి చేశామని చెప్పారు. బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ యలమంచిలి మీదుగా వెళ్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌వర్మ, ఎంపిపి బోదెపు గోవిందరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొద్దపు ఎర్రయ్యదొర, వైస్‌ ఎంపిపి రాజాన శేషు, జడ్పీటిసీ సంధ్యారాము, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా, రాజాన మహలక్ష్మి, కొల్లి త్రినాధ్‌, దాసరి కుమార్‌, మళ్ల కన్నారావు తదితరులు పాల్గొన్నారు.

➡️