యుటిఎఫ్‌ పోరుబాట ర్యాలీ, 12 గంటల ధర్నా

Jan 3,2024 21:07

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి, 12 గంటల పాటు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు మాట్లాడుతూ సుమారు రూ.18 వేల కోట్లు బకాయిలున్నాయని, ఉపాధ్యాయుల పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బును ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ఈ సొమ్మను ఇతర అవసరాలకు మరల్చడానికి ప్రభుత్యానికి హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. జెఎసి చైర్మన్‌ జి.కిశోర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ మాట్లాడుతూ జగన్‌ మాట తప్పి మడమ తిప్పారని అందుకు ఈ పోరాటం చేస్తున్నామని, ఈనెల 9,10 తేదీల్లో 36 గంటల ధర్నా విజయవాడలో జరుగుతుందని, ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం వంటా – వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ధర్నా రాత్రి8 గంటల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ సాంస్కృతిక బృందం చైర్మెన్‌ ఆర్‌.గౌరునాయుడు ఆధ్వర్యంలో పలు ఉద్యమ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.మధు, జిల్లా సహాధ్యక్షులు వి.జ్యోతి, జిల్లా కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్శులు ఎన్‌.శ్రీను, బి.కూర్మారావు, ఎం.పైడిరాజు, ఎం.శంకరరావు, కె.జానకీరావు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️