రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి

Mar 6,2024 21:10

 ప్రజాశక్తి-భామిని  : రక్త హీనత, మాత, శిశు మరణాల నివారణకు సమిష్టి కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు స్పష్టం చేశారు. భామిని మండలంలో బుధవారం భామిని, బత్తిలి, బాలేరు పిహెచ్‌సిలను ఆయన తనిఖీ చేశారు. బూర్జోలులో జెఎఎస్‌ పరిశీలన, బాలేరు సచివాలయంలో ప్రిజమ్‌10 పై సమీక్షా సమావేశం నిర్వహించారు. పిహెచ్‌సిల్లో సాధారణ ప్రసవాలు ఏమేరకు జరుగుతున్నాయి, వీటికి ఆరోగ్య అసరా వర్తింపజేస్తున్న వివరాలపై ఆరా తీసి రికార్డులు తనిఖీ చేశారు. గర్భిణులకు ఆరోగ్య ఆసరా వర్తింప జేయడంపై జాప్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫార్మసీలో మందుల నిల్వలు, వ్యాక్సిన్‌ నిల్వలు పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పలు కౌంటర్ల వద్ద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అవసరమైన వారికి రిఫరల్స్‌ చేసి చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. వివరాలు ఆన్లైన్‌ నమోదు చేయాలన్నారు. బాలేరు సచివాలయంలో ప్రిజమ్‌10 ప్రాజెక్ట్‌పై నిర్వహించిన సమీక్షలో డాక్టర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ పదేళ్లలోపు వయస్సున్న శిశు మరణాల రేటును తగ్గించడమే ప్రిజమ్‌-10 లక్ష్యమన్నారు. ఇందుకు వైద్య, సచివాలయ, మహిళా సమాఖ్య, స్వయం సహాయక సంఘాల సమిష్టి కృషి అవసరమని అన్నారు. ఇందులో ప్రధానంగా గర్భిణుల నమోదు త్వరగా జరగాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఆరోగ్య పరీక్షలు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రతీ సచివాలయ పరిధిలో రక్త హీనత, హైరిస్క్‌ గర్భిణీ, బాలింతలు వివరాలు, సామ్‌, మామ్‌ పిల్లల వివరాలు, రక్త హీనత ఉన్న కిశోర బాలికల వివరాలు ఉండాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో సంరక్షణ అదికారుల (అడాప్షన్‌ ఆఫీసర్‌)ను నియమించి, వీటిపై పర్యవేక్షణ చేసి వివరాలు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్‌ డైరీలో నమోదు చేయాలన్నారు. గుమ్మలక్ష్మీపురం : మండల కేంద్రంలోని వైటిసి కేంద్రాన్ని సందర్శించి, అక్కడ గర్భిణుల ఆరోగ్య పరిశీలన చేశారు. కాన్పు గడువు తేదీలను ఎంసిపి కార్డులో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ కొయ్యాన అప్పారావు తదితరులు ఉన్నారు.

➡️