రానున్నది ప్రజా ప్రభుత్వం: కందుల

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: యువగళం ముగింపు సభను భారీ ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జవహర్‌ నగర్‌లోని స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని పోలేపల్లిలో జరిగిన నారా లోకేష్‌ యువగళం ముగింపు సభకు మునుపెన్నడూ లేనివిధంగా లక్షలాదిగా హాజరై నవశకానికి నాంది పలికారని అన్నారు. సభకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ విచ్చేసి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్తవరవడికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రజా ప్రభుత్వం రాబోతోందని, దీనికి నాంది యువగళం ముగింపు సభకు ప్రజలు లక్షలాదిగా హాజరై తమ మద్దతు తెలియజేశారన్నారు. ఈ దుర్మార్గపు వైసిపి పాలనలో ల్యాండ్‌, శాండ్‌, వైన్‌ మాఫియాలే రాజ్యమేలుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️