రూ.5.81 కోట్లతో అభివృద్ధి పనులు

Dec 28,2023 21:03

 ప్రజాశక్తి-భోగాపురం, నెల్లిమర్ల  :   రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాల నాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో రూ.5.81 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌లతో కలసి గురువారం ప్రారంభించారు. ముందుగా భోగాపురంలోని సుందరపేట వద్ద రూ.3.95 కోట్ల నాబార్డు ఆర్థిక సాయంతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించారు. నెల్లిమర్ల మండలం రామతీర్ధంలోని శ్రీరామస్వామి ఆలయం వద్ద రూ.75 లక్షల కామన్‌ గుడ్‌ ఫండ్‌ నిధులతో చేపట్టిన భాస్కర పుష్కరిణి అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. తొలుత శ్రీరామస్వామి వారి ఆలయాన్ని మంత్రితో పాటు ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దర్శించుకున్నారు. అనంతరం జరజాపుపేటలో రూ.1.11 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ఆరోగ్యకేంద్రం భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంఎల్‌సి పెనుమత్స సురేష్‌బాబు, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాస్కరరావు, డిసిహెచ్‌ఎస్‌ గౌరీశంకర్‌, వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఇఇ సత్యప్రభాకర్‌, రామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భోగాపురంలో మండల వైసిపి అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, పడాల శ్రీనివాసరావు, భాను, సుందర హరీష్‌, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1 నుంచి నుంచి పింఛన్ల పండుగ విజయనగరం : జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండగ జరుగుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్రపంచాయతీరాజ్‌శాఖా మంత్రి బూడి ముత్యాలునాయుడు అన్నారు. పింఛన్ల పెంపు, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ చేయూత పథకాల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బూడి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడారు. పింఛను జనవరి నుంచి రూ.3వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా వారోత్సవాలను జనవరి 23 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు. చేయూత పథకం నాలుగో విడత ఫిబ్రవరి 5 నుంచి 14 అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చి వలంటీర్లను సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎంఎల్‌సి డాక్టర్‌ పి.సురేష్‌బాబు, ఎంఎల్‌ఏలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️