రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం రైతులకు ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి, విశ్వనాధపురం, కేసినేనిపల్లి గ్రామాల్లో టిడిపి కేంద్ర బందం పర్యటించింది. మిచౌంగ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వరి, మిర్చి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. రైతాంగం పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేలు, మిర్చి రైతులకు ఎకరాకు రూ. 50 వేల వంతున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్న విశ్వనాధపురం గ్రామానికి చెందిన రైతు కటికి రమణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం రైతు కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు, నాయకులు వలరాజు, షేక్‌ మాబు, కాకర్ల కోటయ్య, చేకూరి సుబ్బారావు, భాస్కర్‌, కామేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️