రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జెసి

ప్రజాశక్తి-రాయచోటి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్‌ ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా 5వ ఏడాది 3వ విడత ఆర్ధిక సాయంతో పాటు, రబీ 2021-22, ఖరీఫ్‌ 2022కు సంబంధించి వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్‌ విసి హాలు నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకు మార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లులు హాజరయ్యారు. విసి అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అతిధులతో కలిసి జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ ద్వారా వరుసగా 5వ ఏడాది 3వ విడతగా జిల్లాలో 2,05,806 మంది రైతులకు గాను రూ.41.26 కోట్ల రూపాయలతో పాటు 28,550 మంది రైతులకు రూ.7.639 కోట్ల మేర వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో రైతులకు అందజేశారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి ప్రభుత్వం 5వ ఏడాది 3వ విడత వైఎస్సార్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయంపై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్న ప్రభుత్వం 2023-24 సీజన్‌కు సంబంధించి 3వ విడత పెట్టుబడి సాయాన్ని ఒకేసారి రైతులకు అందజేయడం అభినందనీయమన్నారు. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడం ఆనందదాయక విషయం అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. రైతు భరోసా సాయాన్ని ప్రస్తుతం నిరాటంకంగా 5వ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందివ్వడం సంతోషించదగ్గ విషయం పేర్కొన్నారు. అర్హత ఉండీ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే.. సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్బికెల్లో నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా కాల్‌ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి చంద్ర నాయక్‌, అనుబంధ శాఖల అధికారులు, లబ్దిదారులయిన రైతులు, పాల్గొన్నారు.

➡️