రైల్వే అధికారుల దూకుడు… దీటుగా బాధితులు…

Feb 4,2024 00:18

ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లి పట్టణంలోని రైల్వే స్థలాల్లో పేదల ఇళ్లను తొలగించడానికి రైల్వే అధికారులు దూకుడు పెంచారు. 24 గంటల్లో తట్టాబుట్టా సర్దుకోవాలని లేకపోతే ఇళ్లు కూల్చి వేస్తామని శనివారం మైకు ప్రచారం నిర్వహించారు. దీంతో బాధితుల్లో ఆందోళనతో పాటు ఆగ్రహం పెల్లుబీకింది. శనివారం ఉదయం ఐదు గంటల నుంచే సిపిఎం, సిపిఐ, వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు రైల్వే సిబ్బంది వస్తే ఎదుర్కోవడానికి, వారికి ధీటుగా జవాబు ఇవ్వడానికి వార్డుల్లో బాధితులను సిద్ధపరిచారు. పేదలు కూడా తమ పనులు మానుకుని బుల్డోజర్‌ వస్తే అడ్డుపడటానికి సిద్ధమయ్యారు. దీంతో శనివారం రైల్వే అధికారుల వైపు నుండి ఎటువంటి ప్రతిఘటనా ఎదుర్కోకపోవడంతో పేదలు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని బాధితులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించాయి. కార్యక్రమంలో సిపిఎం పట్టణ రూరల్‌ కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, నాయకులు, కె.బాబురావు, డివి భాస్కర్‌రెడ్డి, వైసిపి నాయకులు ఇ.డేవిడ్‌రాజు, ఎం.వివేకానందరెడ్డి, కె.రాజశేఖరరెడ్డి, ఎం.వెంకటరామిరెడ్డి, ఎం.ప్రకాష్‌, సిపిఐ నాయకులు కె.కాశయ్య, టి.వెంకటయ్య, కాంగ్రెస్‌ నాయకులు డి.సామ్యేలు, టిడిపి నాయకులు వి.వెంకట్రావు పాల్గొన్నారు.

➡️