వడ్డెర్లకు అండగా నిలబడతాం : టిడిపి

Mar 31,2024 21:35

మాట్లాడుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజాశక్తి – మాచర్ల :
టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వడ్డెర్లు అండగా ఉన్నారని, వారి ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు అండగా ఉంటామని టిడిపి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. స్థానిక నరిశెట్టి కళ్యాణ మండపంలో మాచర్ల నియోజకవర్గం వడ్డెర సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మాచర్లలో వడ్డెర సామాజిక వర్గానికి చెందినవారు కొన్ని సమస్యలు తనదృష్టికి తెచ్చారని చెప్పారు. అధికారంలోకి రాగానే తన ఎంపీ నిధులతో కళ్యాణ మండపం నిర్మిస్తామని, శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. కాయకష్టం చేసి బతికే వడ్డెరలకు వారి పనులకు అవసరమైన ట్రాక్టర్లు, మిల్లర్లు, జెసిబిలు సబ్సిడీ ధరకు అందేలా చూస్తామన్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పక్కనే ఉన్న ఈ ప్రాంతం తాగు, సాగునీటి సమస్యతో అల్లాడిపోతోందని, ప్రతి ఇంటికీ నీరు అందించేందుకు తాను, బ్రహ్మారెడ్డి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కలిసి వడ్డెర్ల వేలుతో వడ్డెర్ల కళ్లనే పొడుస్తున్నారని అన్నారు. తురక కిషోర్‌కు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఇచ్చి అతనితో అరాచకాలు చేయిస్తున్నారని, వడ్డెర్ల ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై కేసులు పెట్టించడం వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. వడ్దెర్లే దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లుగా ఎమ్మెల్యే చిత్రీకరించారని అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వ తీరు వల్ల భవన నిర్మాణ రంగంలో అధికంగా ఉపాధి పొందుతున్న వడ్డెరలు పనులు కోల్పోయారన్నారు. క్వారీ పనుల్లోనూ ఉపాధి కల్పోయారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు చిరుమామిళ్ల మధుబాబు, కె.దుర్గారావు, టి.ఆంజనేయులు, వి.కృపారావు, వీరస్వామి, వి.కోటేశ్వరరావు, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️