వార్డు హెల్త్‌ సెక్రటరీల సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

Feb 6,2024 21:08

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌: వార్డ్‌ హెల్త్‌ సెక్రెటరీల సస్పెన్షన్‌ ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీల యూనియన్‌ ఆధ్వర్యంలో ఎఎన్‌ఎంలు ధర్నా నిర్వహించి అనంతరం డిఎంహెచ్‌ఒకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ బివి రమణ, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఢిల్లీశ్వరి, బి.రమ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన సాంకేతిక పరికరాల్లో తప్పుగా నమోదైన సమస్యలకు ఎఎన్‌ఎంలను బాధ్యులుగా చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ఉద్యోగులు తప్పు చేయకపోయినా వారిని బాధ్యులను చేయడం సమంజసం కాదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక కారణాలతో సస్పెండ్‌ చేసిన 14 మంది సస్పెన్షన్‌ ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఈ సమస్యలపై ఐక్యంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రమణమ్మ, ప్రమీల, శ్రామిక మహిళా నాయకులు వి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

➡️