వాలంటీర్లతోనూ రాజకీయమా?

ప్రజాశక్తి-రేపల్లె: పెన్షన్ల పంపిణీపై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవ్వ తాతలకు సకాలంలో పింఛన్లు అందించటం చేతకాక వైసిపి నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని రాజకీయ క్రీడకు తెర లేపారని అన్నారు. పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13 వేల కోట్లు తమ సొంత గుత్తేదారులైన కాంట్రాక్టర్లకు ఎన్నికల నిబంధనలను పాటించకుండా దోచిపెట్టి, పెన్షన్‌ పొందే అవ్వ తాతలను మభ్యపెడుతు న్నారని మండిపడ్డారు. వాలంటీర్లు తమ పార్టీ సొంత కార్యకర్తలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఎన్నికల కమిషన్‌ వారిని విధుల నుంచి దూరంగా ఉంచిందని తెలిపారు. టిడిపి, జనసేన ఫిర్యాదుల మేరకు వాలంటీర్లను విధుల నుంచి తప్పించారని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మత్తి భాస్కరరావు మాట్లాడుతూ పింఛన్లు పంపిణీ చేయడానికి సచివాలయ ఉద్యోగులతో ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ పాలల్లో పేదలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అవినీతి పాలనకు బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం అవ్వ తాతల పింఛన్లను రేపటిలోగా అందజేయాలని మున్సిపల్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పంతాన్ని మురళీధర్‌రావు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, తాతా ఏడుకొండలు, టిడిపి పట్టణ అధ్యక్షులు గోగినేని రామారావు, వెనిగళ్ళ శివ సుబ్రహ్మణ్యం, మేక రామకృష్ణ, అన్నం సాయి, గోపరాజు ఉదయ కృష్ణ, దుళ్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️