వికలాంగులకు ఉపకరణాల పంపిణీ

Feb 7,2024 20:31

ప్రజాశక్తి – కొత్తవలస : మంగళపాలెంలోని గురుదేవ్‌ ట్రస్టులో బుధవారం వికలాంగులకు నోయిడా ఇస్కాన్‌ టెంపుల్‌ సహాధ్యక్షులు హెచ్‌.జి.వేదాంత చైతన్య దాస్‌ స్వామీజీ చేతులు మీదుగా విర్కో ఫౌండేషన్‌ ఆర్ధిక సహకారంతో ఉపకరణాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అవయవాలు కోల్పోయినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. దేశ నలుమూలల నుంచి వస్తున్న లక్షలాదిమంది వికలాంగులకు ఉచితంగా ఉప కారణాలను అందించడంతో పాటూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న ట్రస్ట్‌ సేవలను కొనియాడారు. ముందుగా ట్రస్ట్‌ ప్రాంగణంలోని అవయవ తయారీ కేంద్రం, గురుదేవ హాస్పటల్స్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విర్కో ఫౌండేషన్‌ సిఎస్‌ఆర్‌ నిధులు సుమారు రూ.20లక్షలతో సమకూర్చిన 288 మంది వికలాం గులకు సిఇఒ తిరుమూరు ప్రవీణతో కలిసి కృత్రిమ కాళ్ళు, చేతులు, బ్లైండ్‌ స్టిక్స్‌, చంక కర్రలు, చెవిటి మిషన్లు, వీల్‌ చైర్స్‌ ఉచితంగా అందజేశారు. 100మంది అంధులకు పింఛన్లు, 200 మంది వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు.కార్యక్రమంలో బిఎంఎస్‌ ఆలిండియా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బి.సురేంద్ర(ఢిల్లీ), రాష్ట్ర కార్యదర్శి, కె.లోవరెడ్డి, కృష్ణ కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌ రామారావు, గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రాపర్తి జగదీష్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఫణీంద్ర, డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ కిషోర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️