విద్యార్థులు సంసిద్ధం

Jan 7,2024 22:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి తెలిపారు. విద్యార్థులను ఇప్పటికే సన్నద్ధం చేసినట్లు చెప్పారు. ఈవారం తనను కలిసిన ‘ప్రజాశక్తి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తున్నారు?, ఎటువంటి ప్రణాళిక అమలు చేశారు? వంటి విషయాలను ఆయన వివరించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు…ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరుకానున్నారు.? ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 4442 స్కూళ్ల నుంచి 23,910 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, ప్రయివేటుగా 3394 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.పదో తరగతి సిలబస్‌ పూర్తి అయ్యిందా.? పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశ బోధన అక్టోబర్‌ నెలతో పూర్తయింది. సిలబస్‌ పూర్తయ్యాక ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్‌ నిర్వహించి విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నాం.ఫలితాల మెరుగుదలకు తీసుకున్న చర్యలు ఏమిటి.? పదో తరగతిలో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందుకనుగుణంగా పాఠ్యాంశ బోధన, విద్యార్థులను చదివించడం చేస్తున్నాం. పూర్తయిన ప్రతి పాఠ్యాంశంపైనా పరీక్ష నిర్వహించి, విద్యార్థులను సంసిద్ధం చేశాం. ప్రతి వారం, నెల వారీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలే లక్ష్యంగా తీర్చిదిద్దాం.100 రోజులు ప్రణాళిక ఎలా అమలవుతోంది.? పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యే విధంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు వంద రోజులు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ఈ ప్రణాళిక ద్వారా ప్రతి సబ్జెక్ట్‌ టీచర్‌కి అందులో వెనుకబడి ఉన్న విద్యార్థి బాధ్యత అప్పగించి, మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కృషి చేస్తున్నాం. గతేడాది ఫలితాల్లో జిల్లా వెనుకబడి ఉంది, ఇంకా మెరుగైన ర్యాంకు కోసం తీసుకున్న చర్యలు ఏమిటి.? ఈ ఏడాది ప్రయివేటు స్కూళ్లతో సమానంగా ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ప్రతి విద్యార్థి కేంద్రంగా చదివిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుడిని అటాచ్‌ చేసి, మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రయత్నాలు చేశాం. దీనివల్ల ఈ ఏడాది ఎక్కువ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎన్ని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.? ఈ ఏడాది జిల్లాలో 128 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను గుర్తించి అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలను పరిశీలించాం. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటాం.

➡️