వెనక్కు తగ్గని అంగన్వాడీలు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆయా కార్యాలయాల ఎదుట బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్వాడీల సమ్మె తొమ్మిదో రోజు భిక్షాటన చేస్తూ తెలిపిన నిరసన విజయవంతమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.భాగ్య లక్ష్మి తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ముందు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సందర్భంగా పట్టణంలోని దుకాణాదారులు, వ్యాపార సంస్థలు, పేద మధ్య తరగతి ప్రజానీకం, వ్యాపారస్తులు, తోపుడు బండ్లు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లి అంగన్వాడీలు భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అంగన్వాడీలకు ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీలు సిద్దమ్మ, బంగారుపాప, ఖాజాబి, విజయమ్మ, నాగమణి, సబీనా, ప్రవీణ, అరుణ, పద్మజ, అమ్ములు, చంద్రకళ, శంకరమ్మ, సుమలత, భూదేవి, హమాలీ నాయకులు మూధవయ్య పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి అగ్నిమాపక కేంద్రం మీదుగా ర్యాలీగా తరలి వెళ్లి దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కి భిక్ష ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. నిరసనకు మున్సిపల్‌ కార్మికులు పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజిని, విజయ, అమరావతి పాల్గొన్నారు. పీలేరు: మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచిన దాఖలా ఎప్పుడూ లేదని సిఐటియు, ఎఐటియుసి నాయకులు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం ముందు చెవిలో పూలతో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ ప్రభుత్వం పగులగొడుతోంది అంగన్వాడీ కేంద్రాల తాళాలు కాదని, వాటిలో పనిచేసే సిబ్బంది గుండెలని అన్నారు. ప్రభుత్వం సత్వరం తగిన చర్యలు తీసుకుని అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు, సహాయకుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సమ్మె ఉధతిని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దనాసి వెంకటరామయ్య, ఎఐటియుసి నాయకులు నరసింహులు, సాంబశివ, పీలేరు నరసింహులు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సరళమ్మ, రెడ్డమ్మ, శారద, ప్రేమ, ఎల్లమ్మ, రూప, సుహాసిని, శోభ తదితరులు పాల్గొన్నారు. బి.కొత్తకోట : తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్వాడీలుర ప్రతిరోజు వినూత్న రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. పట్టణంలో భిక్షాటన చేపట్టారు.ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, మదనపల్లి సీనియర్‌ నాయకులు హరీందర్‌ శర్మలు హాజరయ్యారు. పట్టణంలోని జయశ్రీ కాలనీ నుంచి నగర పంచాయతీ కార్యాలయం, దిగువ బస్టాండ్‌, జ్యోతి చౌక్‌ వరకు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వాన్ని అంగన్వాడీలు అడిగితే పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని,గౌరవ వేతనం కాకుండా సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. తంబళ్లపల్లి :అంగన్వాడీలు భిక్షాటన చేశారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధతి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లిలో దుకాణాలు, వర్తక వ్యాపారం దగ్గర భిక్షాటన చేస్తూ అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిడిపిఒ కార్యాలయం వద్ద నుండి లక్కిరెడ్డిపల్లి టౌన్‌ దుకాణాలు వర్తక వ్యాపారం దగ్గర భిక్షాటన చేసి వారి మద్దతు కోస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సుకుమారి ప్రాజెక్టు కార్యదర్శి ఓబులమ్మ సెక్టార్‌ లీడర్‌ ప్రభావతి, లక్ష్మీదేవి, రుక్మిణి, శారద పాల్గొన్నారు. మదనపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల ర్యాలీగా షాపులను తిరుగుతూ భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మధురవాణి, రాజేశ్వరి, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️