సందడే సందడి

Dec 10,2023 21:40

ప్రజాశక్తి-సీతంపేట :  అసలే కార్తీక మాసం. ఆపై ఆదివారం.. అది కూడా కార్తీకమాసం చివరి ఆదివారం. ఇంకేముంది! దారులన్నీ అడ్వెంచర్‌ పార్కువైపే. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో సీతంపేటలోని ఎన్‌టిఆర్‌ అడ్వెంచర్‌ పార్కు కిటకిటలాడింది. ఉద్యానవనమంతా సందడి సందడిగా మారింది. కార్తీక మాసం ప్రారంభం కాగానే టక్కున గుర్తుకొచ్చేది సీతంపేటలోని ఐటిడిఎ అడ్వెంచర్‌ పార్కు. ఎందుకంటే చిన్నారులు, యువత, పెద్దలు.. ఇలా అందరినీ అలరిస్తుంది. అందుకు తగ్గ కార్యక్రమాలు అక్కడ ఉన్నాయ. పర్యాటక ప్రేమికులకు పార్కు ప్రత్యేకమైన అనుభూతిగా మారింది. సీతంపేట మన్యంలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. జగత్‌పల్లి రిసార్ట్స్‌, ఆడలి వ్యూ పాయింట్‌, సున్నపుగడ్డ, మెట్టుగూడ జలపాతాలు, మైమరిపించే ప్రకృతి అందాలు, పచ్చనిపొలాల సోయగాలు, ఒంపుసొంపులతో కనువిందు చేసే కొండలు.. ఇలా ఎన్నెన్నో పర్యాటక అందాలు మన్యం సొంతం. వాటికి అదనపు, ప్రత్యేక ఆకర్షణగా అడ్వెంచర్‌ పార్కు తోడైంది. వీటిని సందర్శించేందుకు ఆదివారం మన్యం జిల్లాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివచ్చారు. ప్రధానంగా ఎన్‌టిఆర్‌ అడ్వెంచర్‌ పార్కుకు పర్యాటకులు పోటెత్తారు. ఆకాశంలో స్కైసైకిల్‌ తొక్కుతూ, జలవిహార్‌లో బోటు షికారు చేస్తూ, హ్యాంగింగ్‌ బ్రిడ్జిపై నడుస్తూ యువత, చిన్నారుల సందడి చేశారు. చిన్నారులు మినీ ట్రైన్‌, మినీ బోటింగ్‌ చేసి, కమాండ్‌ నెట్‌ ఎక్కి సరదాగా ఆడుకున్నారు. ఆనంద విహార వద్ద యువత ఉల్లాసంగా డాన్సులు వేశారు. మరి కొంతమంది పర్యాటకులు సాహస విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలతో అడ్వెంచర్‌ పార్కు.. పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది.

➡️