సమస్యలతో సహజీవనం 

Dec 10,2023 21:33

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం  :  మండలంలోని పెద్దఖర్జ పంచాయతీ దిగువసప్పగూడ గిరిజన గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామం ఏర్పడి 40 ఏళ్లు దాటినా కనీస మౌలిక వసతులు లేవు. తాగేందుకు నీరు లేక, పక్కా గృహాలు మంజూరు కాక గిరిజనులు అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. దిగువసప్పగూడ గ్రామంలో 14 కుటుంబాలుండగా, 120 మంది వరకు జనాభా ఉన్నారు. గ్రామంలో బోర్లు లేకపోవడంతో కొండవాగు చెలమలు, బావి నీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి కాలం వచ్చిందంటే వాగు నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఉన్న బావి నీరు కూడా అడుగంటిపోతోంది. దీంతో ఏటా వేసవిలో నీటి సమస్య తప్పడం లేదని గ్రామస్తుడు భీమారావు ఆవేదన వ్యక్తంచేశారు. పక్కా గృహాలు లేకపోవడంతో శిథిలమైన రేకిళ్లలోనే తలదాచుకుంటున్నారు. టిడిపి హయాంలో రెండు పక్కా ఇళ్లు మాత్రమే నిర్మాణం చేపట్టారు. గ్రామ వాలంటీర్‌ వచ్చి పక్కా గృహాలు మంజూరు అయ్యాయని చెప్పడంతో ఉన్న ఇళ్లను విరగ్గొట్టారు. ఇళ్ల నిర్మాణాల కోసం అధికారులను అడగ్గా, ‘మీకు ఎవరు కట్టుకోమన్నార’ని అనడంతో ఏం చేయాలో తెలీక ఉండి పోయామని గిరిజనులు మండంగి నీలకంఠం, బిడ్డిక మన్మథరావు, టి.తౌడు, ఎం.దానిమ్మ వాపోయారు. ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఐటిడిఎ ద్వారా ట్రైకార్‌ రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. గ్రామంపై ఐటిడిఎ అధికారుల దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

➡️