సమ్మె ప్రభుత్వం వైఫల్యమే : సిపిఎం

మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌
ప్రజాశక్తి- పల్నాడు జిల్లా :
అంగన్వాడీల సమ్మె ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, వారికిచ్చిన హామీలను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి విస్మరించారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో పల్నాడు విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 12 నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఢిల్లీలో రైతు పోరాటం స్ఫూర్తితో సమ్మెను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఉద్ఘాటించారు. తెలంగాణ కంటే అదనంగా జీతాలిస్తామనే సిఎం హామీ అమలు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు మే నెల నుండి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టారని చెప్పారు. సమస్యలను పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం అసత్య ప్రచారాలకు తెరదీసిందని, గత ప్రభుత్వం రూ.4500 పెంచగా ఈ ప్రభుత్వం రూ.వెయ్యి పెంచి మొత్తం తామే పెంచినట్లు అసత్య ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికి మూడుసార్లు చర్చలకు పిలిచిన ప్రభుత్వం కీలకమైన వేతనాలు, గ్రాట్యుటీ ప్రస్తావన లేకుండా మాట్లాడుతోందని, మరోవైపు సమ్మెను అణిచివేసేందుకు పూనుకుంటూ కేంద్రాల తాళాలను పగలగొట్టిస్తోందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చుంటున్న సచివాలయ ఉద్యోగులు ఏం చేయాలో అర్థమవ్వక తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. అంగన్వాడీల పోరాటానికి ప్రజా సంఘాలు, ప్రజలు అండగా నిలవాలని, తాళాలు పగలగొట్టిన అంగన్వాడి సెంటర్లకు కొత్త తాళాలేయాలని కోరారు. ప్రభుత్వ బెదిరింపులను, నిర్బంధాలను భరిస్తూ అంగన్వాడీలు పట్టుదలగా నిరవధిక సమ్మె చేపట్టడం అభినందనీయమన్నారు.

➡️