సారా నియంత్రణలో సిఐ కృషి అభినందనీయం

Feb 12,2024 21:09

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో నాటుసారా నియంత్రణలో పట్టణ సిఐ జిడి బాబు చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, పట్టణ వైసిపి యువజన అధ్యక్షులు బవిరెడ్డి ప్రసాద్‌, అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ పువ్వుల శ్రీనివాస్‌ భరత్‌, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గొర్లి ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో సిఐ బాబును దుశ్శాలువాతో వారు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా పట్టణంలో విచ్చలవిడిగా నాటుసారా విక్రయాలు జరిగాయని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయని చెప్పారు. గతంలో పని చేసిన పోలీసు అధికారులెవరూ చేయలేని పనిని జిడి బాబు సాధించారని కొనియాడారు. నాటుసారా అమ్మకాలు, వినియోగం వల్ల కలిగే నష్టాలు, కేసుల గురించి అవగాహన కల్పిస్తూ వారిలో పరివర్తన తీసుకొచ్చారని చెప్పారు. నాటుసారా నియంత్రణకు ఆయన చేపడుతున్న చర్యలు కారణంగా ఆ వృత్తిపై ఆధారపడిన వారు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్తున్నారని అన్నారు. సిఐ జిడి బాబును నియమించిన జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు, సిఫార్సు చేసిన డిప్యూటీ సిఎం రాజన్నదొరకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడ్డి యశోదకృష్ణ, బి.బాలకృష్ణ, మేకల శంకరరావు పాల్గొన్నారు.

➡️