సిఎం జగన్‌పై టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫిర్యాదు

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు
ప్రజాశక్తి తెనాలి రూరల్‌ :
ఇచ్చిన హామీలను విస్మరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముందు న్నారని గుంటూరు జిల్లా తెలుగునాడు విద్యార్థి సంఘం (టిఎన్‌ఎస్‌ఎఫ్‌) ఉపాధ్యక్షులు వులస పూర్ణ అన్నారు. జగన్మోహన్‌రెడ్డి హామీల విస్మరణపై టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి పథకంక్రింద 82 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చారని, కేవలం 40 లక్షల మందికే పరిమితం చేయడంతోపాటు రూ.13 వేలే తల్లుల ఖాతాల్లో జమ చేశారని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షలు ఇస్తానన్న జగన్‌ హామీ 4 విడతలవారీగా ఒక్కో విద్యార్థికి రూ.9 వేలకు మించి జమ చేయలేదన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్‌ రద్దుచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య ను దూరం చేశారని విమర్శించారు. పాఠశాలలకు చెందాల్సిన విద్యాధనాన్ని నాడు-నేడు పేరుతో వృథా చేశారన్నారు. బూట్లు, బెల్టు, స్కూలు యూనిఫాం రూపంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు బూటక హామీ లుగా గుర్తించి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇ.దేవ, ఎం.శివ, నాగరాజు, సాయికృష్ణ, శాంతి సాయి, టిడిపి నాయకులు పి.రమ్య, ఎం.విజరు, దుర్గా పాల్గొన్నారు.

➡️