సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియానికి శంకుస్థాపన

 ప్రజాశక్తి-ఆరిలోవ : కైలాసగిరిపై అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.4.69 కోట్ల కేంద్ర నిధులు, రూ.93. 80 లక్షలు సైన్స్‌ సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిధులతో అత్యాధునికమైన మ్యూజియం నిర్మాణాన్ని కైలాసగిరిపై నిర్మించనున్నట్లు చెప్పారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికంగా నిలవబోతోందన్నారు. సంవత్సర కాలంలో మ్యూజియం నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మ్యూజియంలో త్రీడీ ఆర్ట్‌ గ్యాలరీ, సిలికాన్‌ మ్యూజియం, సోలార్‌ స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలను పొందుపరచనున్నామని చెప్పారు. భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి విద్యార్థులకు, యువకులకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ మ్యూజియం నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. విశాఖకు వచ్చే పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు ఎంజిఎం పార్క్‌ దగ్గర సీ డెక్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే విశాఖ తీరంలోని ఐదు, ఆరు బీచ్లను సుందరీకరించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సైన్సు సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సిఇఒ డాక్టర్‌ కె.జయరామిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, విఎంఆర్‌డిఎ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర, సెక్రటరీ డి.కీర్తి, స్థానిక కార్పొరేటర్‌ కోరుకొండ వెంకటరత్న స్వాతి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైసిపి నాయకులు దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేసిన విషయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్‌నాథ్‌ స్పందిస్తూ అయిష్టంతో పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచేకన్నా పార్టీని వీడడమే మంచిదని పేర్కొన్నారు.

 

➡️