స్టేడియానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం : కలెక్టర్‌

ప్రజాశక్తి- రాయచోటి నక్కావాండ్లపల్లెలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ స్టేడియానికి అంత ర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని నక్కావాండ్లపల్లిలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 29 ఎకరాలలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించామని చెప్పారు. క్రికెట్‌ స్టేడియానికి ఇచ్చిన భూమికి బదులుగా వారు ఏవైతే కోరుకున్నారో వాటిన్నంటిని అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో క్రికెట్‌ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా చర్య తీసుకుంటా మన్నారు. సాప్‌ వైస్‌ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన ధ్యానచంద్రతో మాట్లాడానని, ఇక్కడ ఉన్న క్రికెట్‌స్టేడియానికి అనుగుణంగా కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలను కూడా అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. గ్యాలరీని, డ్రెయినేజీని రూ. 75 లక్షలతో నిర్మాణం త్వరలో చేపట్టనున్నారన్నారు. అతి త్వరలో రాయచోటిలో రంజి మ్యాచ్‌లను మనం చూడవచ్చని చెప్పారు. స్టేడియం నిర్మాణంలో సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి ఒఎస్‌డి ధనుంజయరెడ్డికి, కలెక్టర్‌ గిరీష పిఎస్‌కి కత్ఞతలు తెలియజేశారు. రాయచోటికి క్రికెట్‌ స్టేడియం, శిల్పారామం, నగర వనం లాంటి ఎన్నో అభివద్ధి పనులను కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు కతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్రికెట్‌ స్టేడియం అన్నమయ్య జిల్లాకు ఒక మణిహారం అని కొనియాడారు. రాయచోటిలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా అభివద్ధికి మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమని, వాటిలో భాగంగానే శిల్పారామం, నగరవనం లాంటి అభివద్ధి పనులను మన జిల్లాకు కేటాయించారన్నారు. నక్కవాండ్ల పల్లి లో 29 ఎకరాలలో ఏర్పాటుచేసిన క్రికెట్‌ స్టేడియం కేవలం క్రికెట్‌ కోసం మాత్రమే కాదని, ఈ ప్రాంతం ఒక క్రీడల కేంద్రంగా అభివద్ధి చెందనుందని చెప్పారు. ఫుట్‌బాల్‌ ఇతర క్రీడలకు ఇండోర్‌ స్టేడియం నిర్మాణం కోసం రూ.50 కోట్లకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలవబోతోందన్నారు. ఈ స్టేడియం నిర్మాణంలో రాయచోటి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని ఆయన సహాయ సహకారాలు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. స్టేడియం నిర్మాణంలో ప్రజలను ఒప్పించి నిర్మాణానికి సహకరించేట్లుగా చేసిన నక్కవాండ్లపల్లి సర్పంచ్‌ ప్రభావతమ్మ సేవలు అభినందనీయమన్నారు. క్రికెట్‌ స్టేడియం నిర్మాణంలో సహకరించిన నక్కవాండ్లపల్లి ప్రజలకు, ఆర్‌ అండ్‌ బి ఇంజనీర్లకు, భూమి ఆక్రమణ కాకుండా కాపాడిన అధికారులకు, నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం క్రికెట్‌ స్టేడియం కు అనుబంధంగా గ్యాలరీ, డ్రెయినేజీ సిస్టం, పాదచారులకు వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ గిరీష పిఎస్‌, కడప అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ చైర్మన్‌ గురు మోహన్లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సహదేవరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌, రాయచోటి మునిసిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాష, నక్క వాండ్లపల్లి సర్పంచ్‌ ప్రభావతమ్మ, తిరుపాల్‌ నాయుడు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️