హలో.. పట్టణంలో డెంగీ కేసులున్నాయా.. లేవు సార్‌..

ప్రజాశక్తి-చిలకలూరిపేట : హలో.. మన టౌన్‌లో డెంగీ కేసులున్నాయా…? లేవు సార్‌.. ఓకే సార్‌.. మన పట్టణంలో డెంగీ కేసులేమీ లేవంట.. కౌన్సిల్‌ సమావేశంలో పారిశుధ్యంపై ఓ కౌన్సిలర్‌ ప్రశ్నించగా అనంతరం ఫోన్‌లో జరిగిన సంభాషణ.. మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్మన్‌ షేక్‌ రఫానీ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ప్రధానంగా పారిశుధ్యం, క్కుకల బెడదపై ప్రతిపక్ష టిడిపి, అధికార వైసిపి కౌన్సిలర్లు ప్రశ్నించగా శిలాఫలకాలకు రూ.5 లక్షల కేటాయింపుపై టిడిపి కౌన్సిలర్‌ ప్రశ్నించారు. పారిశుధ్యంపై టిడిపి కౌన్సిలర్‌ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దోమలు విజృంభిస్తున్నాయని, డెంగీ, ఇతర జ్వరాలతో జనం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని అధికారులను చైర్మన్‌ కోరగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ ఇస్మాయిల్‌ వివరణిచ్చారు. పారిశుధ్య నిర్వహణలో లోపాలేమీ లేవని అన్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ వైద్యులకు చైర్మన్‌ ఫోన్‌ చేసి పట్టణంలో డెంగీ కేసులేమైనా ఉన్నాయ? అని ప్రశ్నించగా లేవని వారు సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని సభాముఖంగా చైర్మన్‌ చెప్పారు. దీనిపై కొద్దిసేపు వాదన అనంతరం వైసిపికి చెందిన 10 వార్డు కౌన్సిలర్‌ బేరింగ్‌ మౌలాలి మాట్లాడారు. తాను ప్రతి సమావే శంలోనూ సమస్యలను చెబుతు న్నానని, అయినా చైర్మన్‌, అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కళామందిర్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న మున్సిపల్‌ దుకాణాల్లో అద్దెలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారికి మద్దతిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రయణికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నా పట్టణంలో బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. ఈయనకు మరో కౌన్సిలర్‌ అన్నపురెడ్డి శ్రీలకీë మద్దతు పలికారు.ఇదిలా ఉండగా తన వార్డులో అభివృద్ధి పనులు చేయడం లేదని, విక్ష చూపుతున్నారని టిడిపి కౌన్సిలర్‌ కొత్త కుమారి ఆరోపించారు. శిలాఫలకాలకు రూ.5 లక్షలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి చైర్మన్‌ స్పందిస్తూ శిలాఫలకాలకు నిధులు మున్సిపాల్టీ ఎందుకు భరించాలని, కాంట్రాక్టర్‌ పెట్టుకోవాలి కదా? అని అధికారులను వివరణ అడిగినా అధికారులు సమాధానం దాటవేశారు. పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్‌లో ఆర్చీ నిర్మాణంపై టిడిపి కౌన్సిలర్‌ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్చీ నిర్మాణంపై మంత్రి రజిని ఫొటో పెట్టడాన్ని తప్పుబట్టారు. ప్రజల డబ్బులతో నిర్మించే ఆర్చిమీద ఫొటోలు తగదన్నారు. అయితే ఇందుకు అధికార పక్ష కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఇలా చర్చ జరుగుతుండగానే సమావేశం ముగిసినట్లు చైర్మన్‌ ప్రకటించగా టిడిపి కౌన్సిలర్లు కొద్దిసేపు నిరసన తెలిపారు.

➡️