హామీలు అమలు చేయాలి

Feb 14,2024 21:38

ప్రజాశక్తి-వీరఘట్టం: జిఒ 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన ఆదాయంలో 60 శాతం నిధులు జీతాలకు వెచ్చించి, ఇస్తున్న జీతాలు పెంచి అందించాలని ఎపి పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. బుధవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌వై నాయుడు, మండల నాయకులు ఎన్‌.ప్రసాదరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల చిన్నచూపు మానుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కార్మికులకు ఇస్తున్న హక్కులను పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పని భారం పెరుగుతున్నందున కార్మికులను పెంచాలని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. సబ్బులు, నూనె, చెప్పులు, బట్టలు ఇవ్వాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, దహన సంస్కార ఖర్చులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సెలవులను అమలు చేయాలన్నారు. ఈ నెల 16న చేపడుతున్న గ్రామీణ భారత్‌ బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామీణ బంద్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.ప్రసాద్‌, వి.కాంచనమ్మ, ఎన్‌.వెంకటేష్‌, పి.శ్రీను, జయమ్మ, కళ్యాణి, సుశీల, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️