హామీలు అమలు చేసిన వారినే గెలిపించాలి

Jan 27,2024 21:34
ఫొటో : ఆసరా చెక్కును అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : ఆసరా చెక్కును అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
హామీలు అమలు చేసిన వారినే గెలిపించాలి
ప్రజాశక్తి- అనంతసాగరం : జగనన్న నవరత్నాల పేరుతో 2019లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే అమలు చేశారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడి వెంటే నడవాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో వైఎస్‌ఆర్‌ ఆసరా 4వ విడత సంబరాలలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వైఎస్‌ఆర్‌ సభా ప్రాంగణం వద్ద మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించి వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి అందచేస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో తాము దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఎంఎల్‌ఎకు మహిళలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, 2019లో ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారన్నారు. 2024లో ఆయన ప్రచారాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే అధికంగా ఇస్తానని చెబుతున్నారని, ఇది ప్రజలు ఎంత మాత్రం నమ్మడం లేదన్నారు. కుప్పం పర్యటనలో అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి చేస్తానని చెబుతున్న బాబు, ముందుగా అక్కడ సొంత ఇల్లు నిర్మించుకుంటే బాగుంటుందని, జగనన్న అమలు చేస్తున్న సంక్షేమాన్ని లోకేష్‌ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ఆయన గత మేలో ఒక మేనిఫెస్టో ప్రకటించారని, అందులో సంక్షేమ పథకాలన్నీ ఇప్పటికే అమలవుతున్న విషయం ప్రజలంతా గమనించారని, ఇలా కాపీ మేనిఫెస్టో కాకుండా ప్రజలకు మీరు ఏం చేస్తారో అది చెబితే బాగుంటుందన్నారు. 2014లో మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మీరు 2019 వరకు చేయకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగు విడతల్లో చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.25వేల కోట్లు అందజేశారని, మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనని, జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీల్లో నూటికి 99 శాతం అమలు చేశారని తెలియజేశారు. ఇలాంటి ప్రజాసంక్షేమ ముఖ్యమంత్రిని అక్కాచెల్లెమ్మలు మళ్లీ ఆశీర్వదించి 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మండలంలో 571 మంది సభ్యులకు రూ.3.58 కోట్లు వైఎస్‌ఆర్‌ ఆసరా నమూనా చెక్కును వారికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

➡️